Australia: వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడానికి కారణం ఇదే!

This is why Australia had elected bowling first in world cup final
  • భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన ఆసీస్
  • అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఆసీస్ టాస్ నిర్ణయం
  • బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ కమిన్స్
  • ఇదే విషయాన్ని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ ను అడిగిన అశ్విన్

ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా విజేతగా నిలవడం తెలిసిందే. ఫైనల్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ టైటిల్ పోరులో ఆసీస్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఎంతో ఒత్తిడి ఉండే ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం క్రికెట్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. 

దీనిపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా సెలెక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీని అడిగాడు. అందుకు బెయిలీ చెప్పిన సమాధానం అశ్విన్ ను విస్మయానికి గురిచేసింది. 

"మేం భారత్ లో అనేక సిరీస్ లతో పాటు ఐపీఎల్ కూడా ఆడాం. అందుకే మాకు ఇక్కడి పిచ్ లపై చక్కని అవగాహన ఉంది. మామూలుగా ఎర్రమట్టి పిచ్ లపై మ్యాచ్ జరిగేకొద్దీ పగుళ్లు వస్తాయి. అలాంటి పిచ్ లపై తేమ ప్రభావం కూడా పెద్దగా ఉండదు. కానీ నల్ల మట్టితో చేసిన పిచ్ లు అందుకు భిన్నంగా ఉంటాయి. నల్ల మట్టి పిచ్ లు మధ్యాహ్నం సమయంలో స్పిన్ కు అనుకూలిస్తుంటాయి... రాత్రివేళ బాగా గట్టిపడి లైట్ల వెలుగులో బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటాయి" అని బెయిలీ వివరించాడని అశ్విన్ తెలిపాడు. 

వాస్తవానికి... ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునేలా చూడు దేవుడా అని ప్రార్థనలు కూడా చేశానని ఈ ఆఫ్ స్పిన్నర్ వెల్లడించాడు. ఎందుకంటే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ ను చాలామంది అర్ధం చేసుకోలేరని తెలిపాడు. కానీ ఆస్ట్రేలియన్లు పిచ్ ను చక్కగా అర్థం చేసుకున్నారని, అందుకే వాళ్లు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారని అశ్విన్ వివరించాడు.

  • Loading...

More Telugu News