Ponguleti Srinivas Reddy: మీరు ఉన్నారనే ధైర్యంతోనే కేసీఆర్‌ను ఎదిరిస్తున్నాను: ఎన్నికల ప్రచారంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇంద్రలోకం, చంద్రలోకం అంటూ మాయమాటలు చెబుతారని విమర్శలు
  • ఇందిరమ్మ రాజ్యంతో మళ్లీ తెలంగాణలో ప్రజారాజ్యాన్ని తెచ్చుకుందామని పిలుపు
  • ఎమ్మెల్యే కందాల ప్రజల కోసం బాధపడుతున్నట్లు మోసపు కన్నీరు కారుస్తున్నారని విమర్శలు
Ponguleti Sudhakar Reddy Interesting comments

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇంద్రలోకం, చంద్రలోకం అంటూ మాయమాటలు చెబుతారని, ఈ దొర మాటలకు మోసపోతే మళ్లీ తెలంగాణ ప్రజలు గోసపడాల్సి వస్తుందని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, దొర చేతికి అప్పగించడానికి కాదన్నారు. ప్రభుత్వం అంటే ప్రజల కోసం పని చేయాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ దొర ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తాడని, మళ్లీ ఎన్నికలు పూర్తి కాగానే ప్రజలు కష్టాల్లో ఉన్నా పట్టించుకోడని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు మాయ మాటలు చెబుతాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఇందిరమ్మ రాజ్యంతో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజారాజ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. తనను గెలిపించాలని, నిత్యం మీతో ఉంటానని... మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటానని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ ఇప్పటివరకు ప్రజల సొమ్ము దోచుకొని దాచుకున్నాడన్నారు. ఆ దాచుకున్న.. దోచుకున్న సొమ్ముతో అక్కడ రేవంత్ రెడ్డిని, ఇక్కడ తనను ఓడించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందుకు కోట్లాది కూపాయలు ఖర్చు చేస్తున్నాడని ఆరోపించారు.

ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ప్రజల కోసం బాధపడుతున్నట్లు మోసపు కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ వ్యక్తి కన్నీరు పెడుతున్నాడని ఆలోచిస్తే కనుక రానున్న అయిదేళ్ల పాటు ఆ కన్నీళ్లను మనం భరించవలసి ఉంటుందని హెచ్చరించారు. మీరు ఉన్నారనే ధైర్యంతోనే తాను కేసీఆర్‌ను ఎదిరిస్తున్నానని ప్రజలనుద్దేశించి అన్నారు. రేపు ఎన్నికలు అయ్యాక అసెంబ్లీలో తప్పకుండా అధికారపక్షంలో నేను, ప్రతిపక్షంలో కేసీఆర్ ఉంటాడని జోస్యం చెప్పారు. అప్పుడు అసెంబ్లీలో ప్రతిరోజు ఆయన చేసిన తప్పులను నిలదీస్తామన్నారు.

More Telugu News