KTR: దుబ్బాకను కొడుతున్నాం... రఘునందన్ రావు ఇంటికే: కేటీఆర్

  • ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే రఘునందనరావు మళ్లీ చెబుతున్నారన్న కేటీఆర్
  • ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్‌లు ఇస్తామన్న కేటీఆర్
  • ఢిల్లీ నుంచి ఎంతమంది వచ్చినా కేసీఆర్ భయపడడం లేదన్న మంత్రి
ktr says Raghunandan rao will not win this time
Listen to the audio version of this article

బీఆర్ఎస్ ఈసారి దుబ్బాకను కొడుతుందని... బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈసారి ఇంటి బాట పట్టడం ఖాయమని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో జరిగిన పార్టీ యువజన గర్జనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రఘునందన్ రావు గెలవకముందు ఎన్నో మాటలు చెప్పారని, హామీలు ఇచ్చారని, కానీ వేటినీ నెరవేర్చలేదన్నారు. ఉప ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు ఇప్పుడు కూడా చెబుతున్నారని దుయ్యబట్టారు.

ఎన్నికల తర్వాత అసైన్డ్ భూములకు పట్టాలు అందజేస్తామని మంత్రి శుభవార్త చెప్పారు. తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని సూచించారు. అప్పుడు కాలిపోయే మోటార్లు, రాత్రి పొలాల వద్దే పడిగాపులు కాసిన సమయం గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నామన్నారు.

కానీ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డిలు ఇరవై నాలుగు గంటల కరెంట్ చూపించమని సవాల్ చేస్తున్నారని, ఇక్కడ దుబ్బాకకు వచ్చి ఓసారి కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుందన్నారు. యాభై ఏళ్ళుగా ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ వచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడగడానికి సిగ్గుండాలన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వంటి వారికి వ్యవసాయం, ఎద్దులు కూడా తెలియవని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు రైతుబంధు దుబారా అంటున్నారని మండిపడ్డారు.

ఇక బీజేపీ నుంచి మీ వద్ద ఓ ఒర్రుబోతు (అరిచేవాడు) ఉన్నారని రఘునందరావును ఉద్దేశించి అన్నారు. ఆయనకు మాటలు తప్ప చేతలు లేవన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ చీకటి రోజులు వస్తాయన్నారు. ఎన్నికల అనంతరం పద్దెనిమిదేళ్లు నిండిన ఆడబిడ్డలకు సౌభాగ్యలక్ష్మి అందిస్తామని, ఆసరా పెన్షన్‌‌ను రూ.5వేలకు పెంచుతామని, రైతుబంధును క్రమంగా రూ.16వేలకు తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. జనవరి నుంచి కొత్త రేషన్, కొత్త పెన్షన్ ఇస్తామన్నారు. ఢిల్లీ నుంచి ఎంతమంది వచ్చినా కేసీఆర్ భయపడటం లేదని, సింహం సింగిల్‌గానే వస్తోందన్నారు.

More Telugu News