David Warner: టీమిండియాతో టీ20 సిరీస్ కు డేవిడ్ వార్నర్ దూరం

  • టీమిండియా-ఆసీస్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • నవంబరు 23 నుంచి డిసెంబరు 3 వరకు సిరీస్
  • స్వదేశానికి వెళ్లిపోతున్న వార్నర్
  • వార్నర్ స్థానంలో ఆరోన్ హార్డీ ఎంపిక
David Warner leaves for home country

టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య నవంబరు 23 నుంచి ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్ కు దూరంగా ఉండాలని ఆసీస్ సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నిర్ణయించుకున్నాడు. టీమిండియాతో టీ20 సిరీస్ ఆడే ఆసీస్ జట్టుకు వార్నర్ ను కూడా ఎంపిక చేశారు. 

అయితే, భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ ముగిశాక స్వదేశానికి వెళ్లాలని వార్నర్ నిర్ణయించుకున్నాడు. వరల్డ్ కప్ లో ఆసీస్ తరఫున వార్నరే అత్యధిక పరుగుల వీరుడు. ఈ ఎడమచేతివాటం డాషింగ్ బ్యాట్స్ మన్ 48.63 సగటుతో 535 పరుగులు చేశాడు. 

వరల్డ్ కప్ నెగ్గిన ఆసీస్ జట్టులో సభ్యుడైన డేవిడ్ వార్నర్ టీమిండియాతో టీ20 సిరీస్ పాల్గొనడంలేదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (క్రికెట్ ఆస్ట్రేలియా) నిర్ధారించింది. వార్నర్ స్థానాన్ని వర్ధమాన ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీతో భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. 

వరల్డ్ కప్ నెగ్గిన ఆసీస్ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు టీమిండియాతో టీ20 సిరీస్ కోసం భారత్ లోనే ఉండిపోనున్నారు. గ్లెన్ మ్యాక్స్ వెల్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా, షాన్ అబ్బాట్, జోష్ ఇంగ్లిస్ లు ఆసీస్ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. 


ఆస్ట్రేలియా టీ20 జట్టు ఇదే...

మాథ్యూ వేడ్ (కెప్టెన్), మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెండార్ఫ్, నాథన్ ఎల్లిస్, షాన్ అబ్బాట్, మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా,  కేన్ రిచర్డ్సన్.

More Telugu News