Seethakka: ఈవీఎం బ్యాలెట్ పత్రంలో చిన్నగా సీతక్క ఫొటో.. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద అర్ధరాత్రి ధర్నా

  • తెల్లవారుజామున 2 గంటల వరకు కొనసాగిన ధర్నా
  • సీతక్కను సముదాయించే ప్రయత్నం చేసిన ములుగు ఎస్సై
  • మరో ఫొటో తీసుకొచ్చి ఇవ్వాలన్న రిటర్నింగ్ అధికారి
  • స్పష్టమైన హామీ ఇవ్వలేదంటూ ధర్నా కొనసాగింపు
Mulugu Congress Candidate Seethakka Midnight Protest At Returning Office
Listen to the audio version of this article

ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క (ధనసరి అనసూయ) గత అర్ధరాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎం బ్యాలెట్ పత్రంలో ఆమె ఫొటో మిగతా అభ్యర్థుల కంటే చిన్నగా ఉండడమే అందుకు కారణం. ఎందుకిలా ఉందంటూ అంతకుముందే ఎన్నికల అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానం రాకపోవడంతో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలతో కలిసి బైఠాయించారు. 

సమాచారం అందుకున్న ములుగు ఎస్సై వెంకటేశ్వర్ కార్యాలయానికి చేరుకుని సీతక్కను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే తప్ప అక్కడి నుంచి కదిలేది లేదని సీతక్క భీష్మించుక్కూచున్నారు. దీంతో స్పందించిన రిటర్నింగ్ అధికారి అంకిత్ మరో ఫొటో ఇవ్వాలని సీతక్కను కోరారు. వెంటనే కాంగ్రెస్ నాయకులు మరో ఫొటో ఇస్తే తీసుకున్న ఆయన బ్యాలెట్‌పై దానిని ముద్రిస్తామని చెప్పి వెళ్లిపోయారు. అయితే, ఆయన హామీలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ నాయకులు తమ నిరసన కొనసాగించారు. తెల్లవారుజామున 2 గంటల వరకు సీతక్క ధర్నా కొనసాగింది. విషయం తెలిసిన రేవంత్‌రెడ్డి సీతక్కకు ఫోన్ చేసి ఆరాతీశారు.

More Telugu News