Amit Shah: ఈసారి మూడుసార్లు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు: కోరుట్లలో అమిత్ షా

  • పసుపు బోర్డుతో ఓసారి... అసెంబ్లీ ఫలితాలు వచ్చాక మరోసారి దీపావళి అన్న అమిత్ షా
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని విమర్శలు
  • కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్న అమిత్ షా
Amit Shah public meeting in Korutla

తెలంగాణ ప్రజలు ఈసారి మూడుసార్లు దీపావళి జరుపుకుంటున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇప్పటికే దీపావళి పర్వదినం జరుపుకున్నారని, కేంద్రం పసుపు బోర్డు ప్రకటించడం రెండో దీపావళి అని, డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాక మరో దీపావళి జరుపుకుంటారన్నారు. కోరుట్లలో ఆయన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తూ వచ్చాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. పసుపు బోర్డు కోసం ధర్మపురి అరవింద్ పోరాటం చేశారని కితాబునిచ్చారు.

బీడీ కార్మికుల కోసం తాము 500 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. ప్రధాని మోదీ పాలనలోనే తెలంగాణకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంటుందని చురకలు అంటించారు. కుటుంబ పార్టీల వల్ల తెలంగాణకు ఎలాంటి మేలు జరగదని తెలిపారు. బీఆర్ఎస్ పాలన అంతా కుంభకోణాలమయం అన్నారు. తాము అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. మోదీ పాలనలో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అయిదో స్థానానికి చేరుకుందని గుర్తు చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

More Telugu News