Narendra Modi: జగజ్జేత ఆస్ట్రేలియా జట్టును మోదీ అవమానించారా?.. వైరల్ అవుతున్న వీడియోపై మండిపడుతున్న అభిమానులు.. వీడియో ఇదిగో!

  • పాట్ కమిన్స్‌కు ట్రోఫీ బహూకరించిన మోదీ, రిచర్డ్ మార్లెస్
  • మోదీ స్టేజి దిగేంత వరకు ఆటగాళ్లను స్టేజిపైకి అనుమతించని ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది
  • బేల చూపులు చూస్తూ స్టేజిపై ఒంటరిగా కమిన్స్
  • క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటున్న ఆసీస్ మీడియా, అభిమానులు
  • సెక్యూరిటీ సిబ్బందిని సమర్థిస్తున్న మరికొందరు
Did Modi insult the winning Australian team here is viral video

ప్రపంచకప్ జగజ్జేత ఆస్ట్రేలియాను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవమానించారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల అభిప్రాయం ఇదే. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఫైనల్‌లో భారత్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌కు భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ కలిసి ట్రోఫీని బహూకరించారు. ఆ వెంటనే జట్టులోని మిగతా సభ్యులు స్టేజిపైకి వచ్చి సంబరాలు చేసుకోవడం చూస్తుంటాం. 

కానీ, గతరాత్రి ట్రోఫీ బహూకరణ తర్వాత మోదీ స్టేజి దిగేంత వరకు విజేత జట్టు ఆటగాళ్లను మోదీ సెక్యూరిటీ సిబ్బంది స్టేజిపైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మోదీ, మార్లెస్ స్టేజి దిగేంత వరకు కమిన్స్ దిక్కులు చూస్తూ, పెదవి విరుస్తూ, అసంతృప్తితో ఒక్కడే స్టేజిపై నిలబడాల్సి వచ్చింది. 

ఈ ఘటనపై నెటిజన్లు, క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదని గుర్తు చేస్తున్నారు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, విజేత జట్టు సంబరాలను అడ్డుకోవడం దారుణమని మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా మీడియా కూడా ఇలాగే స్పందించింది. ప్రపంచకప్‌ను అత్యద్భుతంగా నిర్వహించిన భారత్ చివర్లో మాత్రం సర్వ నాశనం చేసిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

మరికొందరు మాత్రం దీనిని సమర్థిస్తున్నారు. 2006 చాంపియన్స్ ట్రోఫీ విజేత అయిన ఆసీస్‌కు అప్పటి బీసీసీఐ బాస్ శరద్‌పవార్ ట్రోఫీ అందించారు. ఆ వెంటనే స్టేజిపైకి వచ్చిన ఆటగాళ్లు ఫొటోలకు పోజులిస్తుండగా అడ్డుగా ఉన్నారని శరద్ పవార్‌ను చేత్తో నెట్టడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ ఘటన ఇప్పటికీ అభిమానుల కళ్లముందు కదలాడుతుంది. అలాంటిది మరోమారు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతోనే మోదీ స్టేజి దిగేవరకు ఆసీస్ ఆటగాళ్లను స్టేజిపైకి అనుమతించకపోయి ఉండచ్చని మరికొందరు చెబుతున్నారు.

More Telugu News