Asaduddin Owaisi: కేసీఆర్‌కు మద్దతు కాదు కానీ... ఆ స్థానాల్లో బీఆర్ఎస్‌ ను గెలిపించాలని చెబుతున్నాం: అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi says they are not supporting brs but urging people to vote brs
  • తమది ప్రాంతీయ పార్టీ కాబట్టి మధ్యలోకి వెళ్లి ఫుట్‌బాల్ ఆడవద్దనేది తమ ఉద్దేశమన్న అసదుద్దీన్
  • బీజేపీ బీ టీమ్ అంటూ రాహుల్ గాంధీ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
  • రాహుల్ గాంధీకి పొలిటికల్ మతిమరుపు అనే వ్యాధి ఉందని ఎద్దేవా
  • అమేథిలో ఓడిపోయేందుకు స్మృతి ఇరానీ నుంచి రాహుల్ గాంధీ డబ్బులు తీసుకున్నారా? అని ప్రశ్న
తమకు బలం ఉన్న తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నామని, మిగతా స్థానాల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌ ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. అయితే తాము బీఆర్ఎస్‌కు మద్దతివ్వడం లేదన్నారు. 

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెరుగైన ప్రభుత్వాన్ని, పాలనను అందించలేకపోయిందని విమర్శించారు. కానీ ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బీఆర్ఎస్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ప్రశంసించారు. మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని తాము ప్రజలను కోరుతున్నామన్నారు.

రాహుల్ గాంధీపై అసదుద్దీన్ విమర్శలు గుప్పించారు. తమను బీజేపీకి బీ టీమ్ అంటూ రాహుల్ గాంధీ అర్థంపర్థంలేని మాటలు చెబుతున్నారని, తొమ్మిది స్థానాల్లో పోటీ చేయడం తమ పార్టీకి సంబంధించిన అంశమన్నారు. తాము బలమైన స్థానాల్లోనే అభ్యర్థులను నిలబెట్టినట్లు చెప్పారు. మిగతా స్థానాల్లో మాత్రం రాష్ట్రం, సమాజ అభివృద్ధికి కృషి చేసేవారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. 

రాహుల్ గాంధీకి పొలిటికల్ మతిమరుపు అనే వ్యాధి ఉందని ఎద్దేవా చేశారు. ఆయనకు ఉన్న వ్యాధిని ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడని ఎద్దేవా చేశారు. తమపై విమర్శలు చేస్తోన్న రాహుల్ గాంధీ ఆలోచించాలని, 2019లో 500 స్థానాల్లో పోటీ చేసి 50 మినహా అన్నింటా బీజేపీని గెలిపించేందుకు ఆ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ... కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నారు? అని నిలదీశారు.

నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో మాత్రమే రాహుల్ పెద్దవాడయ్యాడని.. తామేమో చిన్నవాళ్లం అయ్యామన్నారు. గుజరాత్ నుంచి వచ్చిన నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యారని, అలాగే మన రాష్ట్రం నుంచి మిగిలిన వారు బయటకు వెళ్లి ఎందుకు పోటీ చేయడం లేదు? అని ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులు ఓడిపోతారని జోస్యం చెప్పారు. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మారుస్తామన్న ఆయన మాటలు ప్రకటనలకే పరిమితమన్నారు.
Asaduddin Owaisi
BRS
Rahul Gandhi
Telangana Assembly Election

More Telugu News