Revanth Reddy: మంద కృష్ణ మాదిగకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

Revanth Reddy demand  for ordinance on sc categorisation
  • ఢిల్లీకి వెళ్లి... ఆర్డినెన్స్ కోసం ప్రధాని మోదీని కలుద్దామన్న రేవంత్ రెడ్డి
  • కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువస్తే మద్దతిస్తామని రేవంత్ రెడ్డి హామీ
  • తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడవచ్చునని వ్యాఖ్య
  • నిజాం నిరంకుశ పాలన... సమైక్య పాలకుల ఆధిపత్యం.. తెలంగాణ వచ్చాక విధ్వంసం.. అంటూ రేవంత్ విమర్శలు
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణకు విజ్ఞప్తి చేస్తున్నాను... ఢిల్లీ వెళ్దాం... ఆర్డినెన్స్ తేవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరదాం... మద్దతుగా నిలుస్తామని నేను హామీ ఇస్తున్నా అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ... అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్దామని, ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రధాని మోదీని కోరుదామన్నారు. కేంద్రం అనుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్స్ ఇవ్వవచ్చునని చెప్పారు. అబద్ధపు హామీలను నమ్మకుండా మంద కృష్ణ మాదిగ కార్యాచరణను ప్రకటిస్తే మద్దతిచ్చేందుకు తాము సిద్ధమన్నారు. 

తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుందన్నారు. నిజాం నిరంకుశ పాలన... సమైక్య పాలకుల ఆధిపత్యం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన విధ్వంసం.. ఇలా మూడు భాగాలుగా చూడాలన్నారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఎవరు సీఎంగా ఉన్నా... ప్రజాదర్బార్‌ను నిర్వహించారని, ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. ఆ ఆదర్శాన్ని తిరిగి పునరుద్దరిస్తామన్నారు. కేసీఆర్‌కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదని, ఇది రాచరికం అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకోలేమని, రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ప్రాధాన్యతలు ఉంటాయన్నారు. రూ.2వేల పెన్షన్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని, కానీ కర్ణాటకలో పెన్షన్‌తో పాటు మహిళలకు అదనంగా నగదు బదలీ అవుతోందన్నారు. 60 నెలల పాలనలో కేసీఆర్ పేదలకు ఒక లక్షా 80 వేల రూపాయలు బాకీ పడ్డారన్నారు.

ఇక 110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం ఓబీసీలను అవమానించడమే అన్నారు. బలహీనవర్గాలు కేసీఆర్‌ను ఓడించాలన్న కసితో ఉన్నారన్నారు. ఆ ఓట్లను చీల్చి కేసీఆర్‌కు సహకరించడమే బీజేపీ వ్యూహమన్నారు. ఏబీసీడీ వర్గీకరణపై గతంలో వెంకయ్యనాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో చేస్తామని చెప్పారని, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇప్పుడు మరోసారి అదే అంశంపై మాట్లాడుతున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ... బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదన్నారు. దళితుల ఓట్లు కాంగ్రెస్‌కు రాకుండా చీల్చేందుకే ప్రధాని మోదీ కమిటీ అన్నారని, ఆ పేరుతో కాలయాపన చేస్తారన్నారు.
Revanth Reddy
KCR
Telangana Assembly Election
Manda Krishna Madiga

More Telugu News