Miss Universe 2023: మిస్ యూనివర్స్‌ 2023గా నికరాగ్వా భామ.. చరిత్ర సృష్టించిన షేనిస్

  • ఎల్‌సాల్వడార్ రాజధాని శాన్‌సాల్వడార్‌లో మిస్ యూనివర్స్ 2023 పోటీలు
  • మిస్ యూనివర్స్‌గా ఎన్నికైన తొలి నికరాగ్వా భామగా షేనిస్ రికార్డ్
  • టాప్-20లోనే ఆగిన భారత భామ శ్వేత శారద
Miss Universe 2023 is Sheynnis Palacios from Nicaragua Indias Shweta Sharda stuck in top 20

నికరాగ్వా అందాల భామ షేనిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023గా ఎన్నికైంది. ఎల్‌సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పనెడా ఎరీనాలో ఈ రోజు జరిగిన బిగ్ ఈవెంట్‌లో షేనిస్ పేరు ప్రకటించగానే ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మార్మోగింది. తన పేరు ప్రకటించగానే షేనిస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అంతకుముందు కొన్ని క్షణాలపాటు ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది. క్షణాలు ఉద్విగ్నంగా మారాయి. అమెరికాకు చెందిన మిస్ యూనివర్స్ 2022 ఆర్ బోనీ గాబ్రియెల్ విజేత షేనిస్‌కు కిరీటం తొడిగింది. 

మిస్ యూనివర్స్ 2023గా ఎంపికైన షేనిస్ ఆ ఘనత సాధించిన తొలి నికరాగ్వా మహిళగా రికార్డులకెక్కింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో షేనిస్ మెరిసింది. ఆస్ట్రేలియాకు చెందిన మోరయ విల్సన్ సెకండ్ రన్నరప్‌గా నిలవగా, థాయిలాండ్ ముద్దుగుమ్మ అంటోనియా పోర్సిల్డ్ ఫస్ట్ రన్నరప్‌గా ఎంపికైంది. 

మిస్ యూనివర్స్ 2023 అందాల పోటీల్లో చండీగఢ్‌కు చెందిన శ్వేత శారద భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. టాప్-20 ఫైనలిస్టుల్లోకి చేరినా ఆ తర్వాత వెనకబడింది. పాకిస్థాన్ కూడా తొలిసారి ఈ పోటీల్లో  పాల్గొంది. ఈ 72వ మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో మొత్తం 84 దేశాల అందాల భామలు పాల్గొన్నారు. అమెరికన్ టెలివిజన్‌ పర్సనాలిటీ జీనీ మాయ్, మిస్ యూనివర్స్ 2012 ఒలివియా కల్పోతోపాటు అమెరికన్ టీవీ ప్రజెంటర్ మారియా మెెనౌనోస్ ఈ పోటీలకు హోస్ట్‌గా వ్యవహరించారు. 

More Telugu News