Etela Rajender: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఎప్పటికీ వారే ముఖ్యమంత్రులు: ఈటల రాజేందర్

  • బీఆర్ఎస్ పార్టీకి బీసీలు, దళితులు, గిరిజనులను సీఎం చేసే దమ్ముందా? అని ప్రశ్న
  • బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని ప్రధాని మోదీ ప్రకటిస్తే కోపం ఎందుకని నిలదీత
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్రకులాల వారే ముఖ్యమంత్రి అవుతారన్న ఈటల
Etala Rajender interesting comments on cm post

బీఆర్ఎస్ పార్టీకి బీసీలు, దళితులు, గిరిజనులను ముఖ్యమంత్రి చేసే దమ్ముందా? అని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు. గజ్వేల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటిస్తే అధికార పార్టీకి కోపం ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబ సభ్యులకే ముఖ్యమంత్రి పదవి అని, ఇతరులకు అవకాశం రాదన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అగ్రకులాల వారే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. తాను గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తుంటే మంత్రి హరీశ్ రావుకు కోపం వస్తోందన్నారు. ఈ నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పరిష్కరించలేదన్నారు.

పదేళ్లవుతున్నా తెలంగాణలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ అనుమతి లేకుండా మంత్రులు ఏం చేయలేని పరిస్థితి ఉంటుందన్నారు. హరీశ్ రావే స్వయంగా పని చేయలేకపోతున్నారన్నారు. పదేళ్లైనా డబుల్ బెడ్రూం ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వం... ఇప్పుడు గృహలక్ష్మి కింద రూ.3 లక్షలు ఇస్తామంటే నమ్మడం ఎలా? అని ప్రశ్నించారు. గాడిదలకు గడ్డి పెడితే... ఆవులు పాలిస్తాయా? అని కేసీఆర్ చెప్పారని, ఇది నిజమేనని, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఏమీ రాదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు. రూపాయి ఖర్చు లేకుండా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తామన్నారు.

More Telugu News