Uttam Kumar Reddy: తెలంగాణ ప్రజలు ఇక రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో లేరు.. ఇప్పటికే రెండుసార్లు రిస్క్ తీసుకున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy responded on rythu Bandhu issue
  • రైతుబంధు ఆపాలని తాను ఫిర్యాదు చేయలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • రైతుబంధుతో పాటు ఇతర పథకాలను నామినేషన్ ప్రక్రియలోపు ఇవ్వాలని మాత్రమే కోరినట్లు వెల్లడి
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి కార్యక్రమం అమలు చేస్తామని హామీ
  • కేసీఆర్‌ను ఈసారి ఇంటికి పంపించడం ఖాయమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
రైతుబంధు ఆపాలని తాను ఫిర్యాదు చేసినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, కానీ అందులో ఎలాంటి నిజం లేదని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతుబంధుతో పాటు ఇతర పథకాలను నామినేషన్ ప్రక్రియలోపు ఇవ్వాలని మాత్రమే తాము కోరామన్నారు. కానీ రైతుబంధును నిలిపివేయాలని ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.

అలాగే 24 గంటల విద్యుత్ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీపైనా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపైనా అసత్యాలు చెబుతున్నారని, ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు. 

తెలంగాణ ప్రజలు ఇక రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో లేరని, ఇప్పటికే రెండుసార్లు రిస్క్ తీసుకున్నారన్నారు. ఈసారి కేసీఆర్‌ను ఇంటికి పంపించడం ఖాయమన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మళ్లీ మోసపోయే పరిస్థితి లేదన్నారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుంగిపోయిందన్నారు. 

Uttam Kumar Reddy
Congress
KCR
BRS
Telangana Assembly Election

More Telugu News