Rahul Gandhi: 'రాహుల్ గాంధీ సంచలన ప్రకటన' అంటూ తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్

  • అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను ప్రజా పాలన భవనంగా పేరు మారుస్తామన్న రాహుల్ గాంధీ
  • ప్రజలందరికీ 24 గంటలు ఆ తలుపులు తెరిచే ఉంటాయని వెల్లడి
  • 72 గంటల్లో సమస్యలు పరిష్కరించేలా సీఎం, మంత్రులు ప్రజాదర్బార్ నిర్వహిస్తారన్న రాహుల్ గాంధీ
The Pragathi Bhavan will be renamed Praja Paalana Bhavan

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును మారుస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల తెలంగాణ అనే స్వర్ణయుగానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌కు ప్రజా పాలనా భవనం అని పేరు మారుస్తామన్నారు. అప్పుడు ప్రజలందరికీ ఈ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని చెప్పారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తీసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండటంతో పాటు ప్రజా సమస్యలను 72 గంటల్లో పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తారన్నారు. జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన ప్రజా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజానీకం తమతో కలిసి రావాలని కోరారు. రాహుల్ గాంధీ ట్వీట్‌ను తెలంగాణ కాంగ్రెస్... 'రాహుల్ గాంధీ సంచలన ట్వీట్' అంటూ ట్వీట్ చేసింది. కాగా, రాహుల్ గాంధీ శుక్రవారం పినపాక, నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ట్వీట్ చేశారు.

More Telugu News