Revanth Reddy: కేసీఆర్ ఎంతమందికి బంగారం పంచారు?: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

PCC chief Revanth Reddy satires on kcr
  • బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు.. ఉన్న బంగారం అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్న రేవంత్ 
  • పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందా? అని ప్రశ్న
  • ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకున్నందువల్లే కాంగ్రెస్ ఆరు హామీలు ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి
కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో పేదలకు ఎంతమందికి బంగారం పంచారు? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్‌పేటలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన నేతలు ఇక్కడకు నీళ్లు తీసుకు వచ్చారా? ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో ఇందరమ్మ ఇళ్లు ఇచ్చామని, రోడ్లు వేశామని చెప్పారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ పేదలకు చేసిందేమీ లేదన్నారు.

ఇప్పుడు వచ్చి కేసీఆర్ మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని, మందు పోయాలి, ఓటుకు రూ.10వేలు ఇవ్వాలనేది వారి ఆలోచన అన్నారు. రూ.1 లక్ష కోట్లు సంపాదించడమే బీఆర్ఎస్ నేతల లక్ష్యమన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ అంటారని, కానీ బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు... ఉన్న బంగారాన్ని అమ్ముకునే పరిస్థితి ఈ పాలనలో ఏర్పడిందన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజల కష్టాలు అర్థం చేసుకొని, పరిష్కరిస్తుందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే తాము ఆరు గ్యారెంటీలను ఇచ్చామన్నారు.
Revanth Reddy
Congress
Telangana Assembly Election
BRS

More Telugu News