Bonda Uma: చివరికి ఏమీ తేల్చలేక విరాళాల్లో బొక్కలు వెతికే పనిలో పడ్డారు: బొండా ఉమ

  • టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు
  • విరాళాల వివరాలు ఇవ్వాలంటూ స్పష్టీకరణ
  • స్కిల్ కేసులో ఏమీ తేల్చలేక ఇప్పుడు విరాళాలపై పడ్డారన్న ఉమ
  • సీఐడీ, సాక్షి, జగన్ దిగజారిపోయారంటూ విమర్శలు
Bonda Uma fires on Jagan and CID

ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ ప్రధాన కార్యాలయానికి నోటీసులు జారీ చేయడం తెలిసిందే. విరాళాల వివరాలు ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ స్పందించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

గత నాలుగున్నరేళ్లుగా స్కిల్ డెవలప్ మెంట్ కేసుని విచారిస్తున్న సీఐడీ చివరకు ఏమీ తేల్చలేక టీడీపీకి ప్రజలు అందించిన  విరాళాల సొమ్ములో బొక్కలు వెతికే పనిలో పడిందని ఎద్దేవా చేశారు. పార్టీకి వచ్చే విరాళాల వివరాలు ఇవ్వాలని టీడీపీ కార్యాలయానికి నోటీసులిచ్చినట్టే, వివిధ మార్గాల్లో వైసీపీకి వస్తున్న డబ్బువివరాలు ఇవ్వాలని అడిగే ధైర్యం సీఐడీకి ఉందా? జగన్ రెడ్డి దేశంలోనే ధనికుడైన ముఖ్యమంత్రిగా ఎలా నిలిచాడో నిజాలు నిగ్గుతేల్చి ప్రజల ముందు వాస్తవాలు ఉంచే ధైర్యం సీఐడీకి ఉందా? అని బొండా ఉమ సూటిగా ప్రశ్నించారు. 

సీఐడీ విభాగం జగన్ రాజకీయ కక్షసాధింపుల కోసం పనిచేసే సంస్థగా దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సాక్షి పత్రికపైనా ఉమ విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి విషపుత్రిక సాక్షి తప్పుడు రాతలతో... ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షనేతల్ని తప్పుడు మనుషులుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజం చేయాలనే జగన్ రెడ్డి, వైసీపీ ఆలోచనా విధానాన్ని సాక్షి మీడియా తు.చ తప్పకుండా పాటిస్తోందని అన్నారు. 

“సీఐడీ విభాగం మొన్ననే టీడీపీ జాతీయ కార్యాలయానికి నోటీసులు పంపింది. ఆ  నోటీసుల్లో సీఐడీ తమకు సంబంధంలేని, తాము అడగకూడని వివరాలు అడిగింది. తెలుగుదేశం పార్టీ... తమకు వచ్చే విరాళాల వివరాలు, ఆదాయ వ్యయాలకు సంబంధించిన సమాచారాన్ని నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కు అందిస్తోంది. తమ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఇచ్చే వివరాలు.. వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా కూడా జగన్ రెడ్డి అవినీతి పుత్రిక సాక్షి కావాలనే తెలుగుదేశంపై బురదజల్లుతోంది. 

జగన్ రెడ్డి, అతని అవినీతి పత్రిక సాక్షి చేసే విషప్రచారాన్ని ఆధారాలతో సహా ఖండించడానికి తాము ఎప్పుడూ సిద్ధమే. తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాల వివరాలు ఎన్నికల కమిషన్ కు అందించినట్టే నేడు ప్రజల ముందు పెడుతున్నాం" అని బొండా ఉమ పేర్కొన్నారు. 

"2014-15 లో సభ్యత్వాల ద్వారా టీడీపీకి వచ్చిన విరాళం: రూ.53 కోట్లు, సభ్యత్వం పొందిన వారు: 52,94,247 మంది. 2015-16 లో ఆన్ లైన్ ద్వారా సభ్యత్వం తీసుకునే అవకాశం కల్పిస్తే, 1,15,477 మంది సభ్యత్వం పొందారు. 

2016-17లో 60,75,031 మంది సభ్యత్వాలు పొందారు. రెండు తెలుగు రాష్ట్రాల కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సభ్యత్వాలు నమోదు చేశారు. 2016-17లో సభ్యత్వాల ద్వారా తెలుగుదేశానికి వచ్చిన సొమ్ము అంతా 1300 బ్యాంక్ బ్రాంచుల ద్వారా వచ్చింది. తెలుగుదేశం పార్టీకి వచ్చే ప్రతిరూపాయి.. ఖర్చుపెట్టే ప్రతి పైసాకి లెక్క ఉంటుంది.

తెలుగుదేశం పార్టీకి రూ.27కోట్లు తప్పుడు మార్గంలో వచ్చాయని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా న్యాయస్థానాల్లో తప్పుడు ప్రచారం చేశాడు. సంవత్సరాల వారీగా పార్టీకి వస్తున్న ప్రతి పైసా వివరాలు లెక్కలు అన్నీ బయటపెట్టాము. 

వైసీపీ నుంచి సాక్షి సంస్థకు వెళ్లిన రూ.150 కోట్ల సంగతేమిటి? రాజకీయ పార్టీ వైసీపీ తనకు వచ్చిన విరాళాల సొమ్ములో రూ.150 కోట్లు సాక్షి పత్రికకు చెల్లించింది. దానిపై సాక్షి పత్రిక ఎందుకు ఎలాంటి రాతలు రాయదు. తెలుగుదేశం పార్టీ మాదిరే, వైసీపీ కూడా వివిధమార్గాల్లో వచ్చే సొమ్ము వివరాలు ఎప్పటికప్పుడు ఎందుకు ప్రజల ముందు ఉంచదు?" అంటూ బొండా ఉమ నిలదీశారు.

More Telugu News