Mallikarjun Kharge: కేసీఆర్‌కు ఓటమి తప్పదని అర్థమైంది... ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు: మల్లికార్జున ఖర్గే

  • కేసీఆర్‌కు పదవీ విరమణ సమయం వచ్చేసిందన్న ఖర్గే
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ
  • మోదీ, కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఆపలేరని వ్యాఖ్య
CM KCR retirement days are close says Mallikarjun Kharge

ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పదవీ విరమణ సమయం వచ్చేసిందని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమైందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ఇప్పటికే ఓటర్లు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను అమలు చేస్తామన్నారు. కర్ణాటకలో ఐదు హామీలను ఇచ్చి వాటిని అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొలి మంత్రివర్గంలోనే ఆమోదిస్తామని ఖర్గే చెప్పారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. బీఆర్ఎస్‌పై బీజేపీ నేతలు విమర్శలు తగ్గించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ పరస్పర విమర్శలు మానేశారన్నారు. వారిద్దరు కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా ఆపలేరన్నారు. బీఆర్ఎస్ మోసాలను ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటానని స్వయంగా చెప్పాడని, అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

More Telugu News