PM Modi: డీప్ ఫేక్ వీడియోల విజృంభణపై ప్రధాని మోదీ స్పందన

  • ఇటీవల రష్మిక, కాజోల్ డీప్ ఫేక్ వీడియోల వైరల్
  • ప్రధాని మోదీ కూడా డీప్ ఫేక్ బాధితుడే!
  • తాను ఓ పాట పాడినట్టు వీడియో రూపొందించారన్న మోదీ
  • తెలిసిన వాళ్లు ఆ వీడియోను తనకు పంపించారని వెల్లడి
  • డీప్ ఫేక్ వీడియోలతో వ్యవస్థకు పెను ముప్పు ఉందన్న ప్రధాని
PM Modi concerned about deepfake videos raising

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా సినీ తారల అభ్యంతరకర దృశ్యాలతో ఉన్న డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. వేరొకరి ముఖాల స్థానంలో రష్మిక మందన్న, కాజోల్ వంటి తారల ముఖాలను మార్ఫింగ్ చేసి రూపొందిస్తున్న ఈ వీడియోలు నిజమైనవే అని భ్రమించేలా ఉంటున్నాయి. 

అంతెందుకు, ప్రధాని నరేంద్ర మోదీ ఓ పాట పాడినట్టు డీప్ ఫేక్ వీడియో రూపొందించడం ఇదెంతటి తీవ్రమైన సమస్యో చెబుతోంది. ఇలాంటి వీడియోలపై సర్వత్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. డీప్ ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని, సమాజంలో గందరగోళానికి దారితీస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు.

"ఇటీవల తెలిసిన వాళ్లు నాకు ఓ వైరల్ వీడియో పంపించారు. అందులో నేను పాట పాడుతున్నట్టుగా ఉంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ఇది సమస్యాత్మకమైన అంశం. డీప్ ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ తరహా వీడియోలపై మీడియా, పాత్రికేయులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలి. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రజలను సన్నద్ధం చేయాలి" అని మోదీ పిలుపునిచ్చారు. 

అంతేకాదు, వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలను గుర్తించి, వాటిని ఫ్లాగ్ చేసి హెచ్చరికలు జారీ చేయాలని చాట్ జీపీటీ బృందాన్ని కోరినట్టు మోదీ వెల్లడించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News