World cup 2023: 2023 వరల్డ్ కప్ మాదిరిగానే 1999, 2007లలోనూ దక్షిణాఫ్రికాను వెంటాడిన బ్యాడ్ లక్!.. అప్పుడు ఏం జరిగిందంటే..!

  • మరోసారి దక్షిణాఫ్రికా కలలు కల్లలు
  • సెమీస్‌లో మరోసారి ఆస్ట్రేలియా చేతిలో చతికిలపడ్డ సౌతాఫ్రికా
  • పునరావృతమైన 1999, 2007 వరల్డ్ కప్ సెమీస్ ఫలితాలు
This is not the first time that South Africa lost to Aussies in the semi final

వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరాలనుకున్న దక్షిణాఫ్రికా కలలు మరోసారి కల్లలయ్యాయి. గురువారం కోల్‌కతా వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో సౌతాఫ్రికా ఓటమిపాలైంది. 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బౌలర్లు గట్టిగానే పోరాడినప్పటికీ ఆస్ట్రేలియానే అదృష్టం వరించింది. దీంతో ఆసీస్‌ ఫైనల్‌కు చేరగా.. దక్షిణాఫ్రికా ఇంటిదారి పట్టింది. అయితే సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం సౌతాఫ్రికాకు ఇది తొలిసారి కాదు. 

ఎప్పటికీ మరచిపోలేని 1999 సెమీస్..

క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని మ్యాచ్‌లలో 1999 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఒకటి. ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొలి బ్యాటింగ్ చేసింది. స్టీవ్ వా, మైఖేల్ బెవాన్ అర్ధ సెంచరీలు చేయడంతో ప్రత్యర్థికి 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో జాక్వెస్ కల్లిస్ అద్భుతంగా ఆడి అర్ధశతకం నమోదు చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించారు. 213 పరుగులకే కట్టడి చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే మెరుగైన కారణంగా ఆస్ట్రేలియా ఫైనల్‌లో అడుగుపెట్టింది.

2007లో ఏకపక్షంగా గెలిచిన ఆసీస్

2007 ప్రపంచ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మరోసారి హోరాహోరీగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 149 పరుగులకే ఆలౌట్ అయ్యింది. విజృంభించిన షాన్ టైట్, గ్లెన్ మెక్‌గ్రాత్ సౌతాఫ్రికా బ్యాటర్లను వణికించారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సులభంగా ఛేదించింది. మైఖేల్ క్లార్క్ అజేయ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా.. శ్రీలంకను ఓడించి ప్రపంచకప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కాగా ఆస్ట్రేలియా మొత్తం ఎనిమిది సార్లు వరల్డ్ కప్ ఫైనల్ చేరుకోవడం గమనార్హం. ఈసారి కప్ కొడితే ఆరుసార్లు గెలుచుకున్న జట్టుగా అవతరిస్తుంది.

More Telugu News