AK-203: రాహుల్ గాంధీ కలలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

  • అమేథీలో ఏకే-203 తుపాకుల తయారీ కర్మాగారం
  • 5 లక్షల తుపాకులు తయారు చేయాలని కేంద్రం లక్ష్యం
  • సిద్ధమైన తొలి విడత తుపాకులు
  • వీటిని పరీక్షించే ప్రక్రియ ప్రారంభమైందన్న ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు
Vishnuvardhan Reddy tweets about AK203 rifles made in Amethi

ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో కేంద్రం ఏకే-203 అస్సాల్ట్ రైఫిళ్ల తయారీ కర్మాగారాన్ని స్థాపించిన సంగతి తెలిసిందే. రష్యాతో కలిసి భారత్ సంయుక్తంగా ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసింది. అమేథీ కర్మాగారంలో 5 లక్షల ఏకే-203 రైఫిళ్లను ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. గత మూడు దశాబ్దాలుగా భారత సైన్యం ఇన్సాస్ తుపాకులను వాడుతోంది. ఇకపై జవాన్లకు ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఏకే-203 రైఫిళ్లను అందించనున్నారు. 

తాజాగా అమేథీ కర్మాగారంలో తొలి విడత తుపాకులు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేత రాహుల్ గాంధీ కలలను ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని తెలిపారు. 

అమేథీలో మొదటి విడతగా తయారైన ఏకే-203 అస్సాల్ట్ రైఫిళ్లను పరీక్షించే ప్రక్రియ మొదలైందని వెల్లడించారు. "ప్రియమైన రాహుల్ గాంధీ... మోదీ గారికి కృతజ్ఞతలు చెప్పండి. ఆయన తాను ఇచ్చిన హామీలనే కాదు, విపక్ష నేతల హామీలను కూడా నెరవేర్చుతున్నారు" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. 

అంతేకాదు, నూతనంగా తయారైన ఏకే-203 రైఫిల్ ను ధరించి ఉన్న సైనికుడి ఫొటోను కూడా పంచుకున్నారు. ఈ ఫొటోలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా ఉన్నారు. 

అమేథీ గతంలో రాహుల్  గాంధీ నియోజకవర్గం అని తెలిసిందే. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిపాలై, కేరళలోని వాయనాడ్ లో గెలిచారు.

More Telugu News