Bengaluru: బెంగళూరులో మహిళకు రాత్రి వేళ వేధింపులు.. నెట్టింట భర్త ఆవేదన

  • కోలీగ్స్‌ను ఇంటివద్ద దింపేందుకు రాత్రి వేళ బయలుదేరిన మహిళ
  • సర్జాపూర్‌లో మహిళ ప్రయాణిస్తున్న కారును కావాలని ఢీకొట్టిన దుండగులు
  • కారులోని వారు స్థానికులు కారని తెలిసి బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు యత్నం
  • వెంటనే పోలీసులు, తన ఫ్రెండ్స్‌కు మహిళ ఫోన్ చేసి అక్కడికి రప్పించడంతో తప్పిన ప్రమాదం
  • మహిళ దారుణ అనుభవం గురించి నెట్టింట పోస్ట్ చేసిన భర్త
Woman Harassed On Bengaluru Street Husband Shares Troubling Story

బెంగళూరులో ఓ మహిళ ఎదుర్కొన్న దారుణ అనుభవం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. స్థానికులు స్థానికేతరులపై వేధింపులకు దిగుతున్న తీరుపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తన భార్య ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాన్ని వివరిస్తూ ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. కన్నడిగుడినైన తాను కూడా రాత్రి 10 గంటల దాటాక కొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతున్నానంటూ అతడు తన ఆవేదన పంచుకున్నాడు. 

బాధితుడి కథనం ప్రకారం, అతడి భార్య నవంబర్ 8న రాత్రి తన కోలీగ్స్‌ను ఇంటివద్ద దింపేందుకు కారులో బయలుదేరింది. సర్జాపూర్‌ ప్రాంతంలో కొందరు టెంపోతో మహిళ కారును కావాలని ఢీకొట్టారు. ఆ తరువాత ఆమెను కొన్ని కిలోమీటర్ల పాటు వెంబడించారు. కారు దిగమంటూ బలవంతం చేశారు. కారులోని వారికి కన్నడ రాదని తెలిసి యాక్సిడెంట్ పేరుతో బ్లాక్‌మెయిలింగ్‌కు ప్రయత్నించారు. 

కానీ మహిళ మాత్రం వారి ఆటలు సాగనీయలేదు. కారును మెయిన్ రోడ్డు పక్కన ఆపేసింది. కారు దిగమని వారు బెదిరిస్తున్నా లెక్కచేయకుండా పోలీసులకు, తన స్నేహితులకు ఫోన్ చేసింది. వారందరూ అక్కడికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని మహిళ భర్త వాపోయాడు. ఇలాంటి ఘటనలకు సర్జాపూర్ హాట్‌స్పాట్‌గా మారిందని, దీనికి పరిష్కారం కనిపెట్టాల్సిన అవసరం ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. 

కాగా, ఈ పోస్ట్‌పై నెట్టింట భారీగా స్పందన వస్తోంది. తామూ ఇలాంటి ఘటనలు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనల్లో తరచూ స్థానికత కోణం కనబడుతోందని చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి కొందరు బెంగళూరు పోలీసులకు కూడా ట్యాగ్ చేశారు.

More Telugu News