Rohit Sharma: న్యూజిలాండ్‌తో సెమీస్ పోరుకు కొన్ని గంటల ముందు రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఏది ఏమైనా జట్టు దృష్టి మొత్తం గెలుపుపైనే ఉంటుందని వెల్లడి
  • గత ప్రపంచ కప్‌ల రికార్డులు కీలకం కాబోవని వ్యాఖ్య
  • కివీస్‌పై బౌలింగ్ ఆప్షన్లు ఉపయోగించే పరిస్థితి రాకూడదని ఆశాభావం
Rohit Sharmas interesting comments before the semis against the Kiwis

మరికొన్ని గంటల్లోనే వన్డే వరల్డ్ కప్ 2023లో అత్యంత రసవత్తరమైన పోరు మొదలుకాబోతోంది. ముంబై వేదికగా డిఫెండింగ్ రన్నరప్ న్యూజిలాండ్‌ను దూకుడు మీద ఉన్న టీమిండియా ఢీకొట్టనుంది. 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్.. వరుసగా రెండోసారి ఫైనల్ చేరాలని కివీస్ ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే స్వదేశంలో అభిమానుల మధ్య సెమీస్ ఆడనుండడంతో టీమిండియా ఆటగాళ్లు ఒత్తిడికి గురయ్యే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ఏది ఏమైనా విజయంపైనే జట్టు పూర్తి దృష్టి పెడుతుందని రోహిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. 1983 ప్రపంచ కప్‌ను ప్రస్తావిస్తూ గత రికార్డులు ప్రస్తుత మ్యాచ్‌లో కీలకం కాబోవని వ్యాఖ్యానించాడు. ‘‘1983 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మేము పుట్టలేదు. 2011 వరల్డ్ కప్ గెలిచిన సమయానికి ప్రస్తుత జట్టులోని సగం మంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు. అదే మా టీమ్ ప్రత్యేకత. గత ప్రపంచకప్‌లను గెలిచిన విధానాలపై మా ఆటగాళ్లు చర్చించుకోవడం నేను చూడలేదు. తదుపరి మ్యాచ్‌కు ఎలా మెరుగవ్వాలి. అత్యుత్తమంగా ఎలా రాణించాలనే దానిపైనే మా దృష్టి ఉంది. మా జట్టులోని ఆటగాళ్ల గొప్పదనం ఇదే. మొదటి మ్యాచ్ నుంచి సెమీస్ వరకు గెలుపుపైనే దృష్టిపెట్టాం’’ అని రోహిత్ పేర్కొన్నాడు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇక హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో టీమిండియా కాంబినేషన్ మారిపోయిందని రోహిత్ వెల్లడించాడు. మొదటి మ్యాచ్ నుంచి ఇతర ఆటగాళ్లతో బౌలింగ్ చేయించాలని భావించామని, జట్టులో బౌలింగ్ ఆప్షన్లు ఉండడం మంచిదని రోహిత్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో బౌలింగ్ ఆప్షన్ ఉపయోగించుకునే పరిస్థితి రాకూడదని ఆశిస్తున్నట్టు చెప్పాడు. ఇదిలావుండగా నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మాన్ గిల్ బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే.

More Telugu News