Shoaib Akhtar: ఐశ్యర్యారాయ్ పై రజాక్ వ్యాఖ్యలను ఖండించిన షోయబ్ అక్తర్

  • ఓ కార్యక్రమంలో దారుణ వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్
  • ఐశ్వర్యా రాయ్ ను పెళ్లి చేసుకుంటే పవిత్రమైన పిల్లలు పుడతారా అంటూ వ్యాఖ్యలు
  • అతడి పక్కన కూర్చుని ఉన్నవాళ్ల బుద్ధి ఏమైందన్న షోయబ్ అక్తర్
  • ఏ మహిళను ఇలాంటి వ్యాఖ్యలతో అవమానించరాదని హితవు
Shoaib Akhtar fires on Abdul Razzaq remarks over Aishwarya Rai

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వరల్డ్ కప్ లో తమ జట్టు ఘోర వైఫల్యం, తమ దేశ క్రికెట్ బోర్డు తీరును విమర్శించే క్రమంలో, ఏ మాత్రం సంబంధంలేని ఐశ్వర్యా రాయ్ గురించి  ప్రస్తావించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జట్టు సభ్యుల్లోనూ, బోర్డులోనూ సంకల్పమే సరిగా లేదని చెబుతూ... ఐశ్వర్యా రాయ్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారా? అంటూ అసందర్భ ప్రేలాపనలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై భారత్ లోనే కాదు, పాకిస్థాన్ లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

రజాక్ వ్యాఖ్యలను పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ కూడా తప్పుబట్టాడు. రజాక్ వేసిన ఈ కుళ్లు జోకును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు అక్తర్ తెలిపాడు. ఈ విధంగా పోల్చడం ద్వారా ఏ మహిళను అవమానించరాదని హితవు పలికాడు. 

రజాక్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అతడి పక్కన కూర్చుని ఉన్నవాళ్లు వెంటనే అభ్యంతరం చెప్పి ఉండాల్సిందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. కానీ వాళ్లు కూడా నవ్వుతూ, చప్పట్లు కొడుతూ అతడి కామెంట్లను ఎంజాయ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

రజాక్ ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయగా.... ఆ సమయంలో వేదికపై అతడి పక్కనే పాక్ మాజీలు షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, ఉమర్ గుల్, యూనిస్ ఖాన్, సయీద్ అజ్మల్, కమ్రాన్ అక్మల్ ఉన్నారు.

More Telugu News