Errabelli: అమెరికా నుంచి వచ్చిపోయే వారికి ప్రజల కష్టాలు తెలుస్తాయా?: ఎర్రబెల్లి దయాకరరావు

  • కేసీఆర్ దయ వల్ల తొర్రూరును మున్సిపాలిటీ చేసుకున్నామన్న ఎర్రబెల్లి
  • పాలకుర్తి నియోజకవర్గం ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ధీమా 
  • ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలుస్తున్నానన్న ఎర్రబెల్లి  
errabelli in palakurthy praja ashirvada meeting

అమెరికా నుంచి వచ్చిపోయే వారికి ప్రజల కష్టాలు తెలుస్తాయా? అని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర రావు కాంగ్రెస్ అభ్యర్థిని ఉద్దేశించి అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్, ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ... కేసీఆర్ దయ వల్ల తొర్రూరును మున్సిపాలిటీ చేసుకున్నామన్నారు. పాలకుర్తికి డిగ్రీ కాలేజీ అడిగితే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఇచ్చారన్నారు. పాలకుర్తికి బీసీ, ఎస్సీ గురుకులాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఈ నియోజకవర్గానికి 5 వేల ఇళ్లు ఇచ్చినట్లు చెప్పారు. చాలా ఏళ్ళుగా పాలకుర్తి, చెన్నూరులలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, వారు చెప్పే మాటలు నమ్మవద్దన్నారు.

పాలకుర్తిలో 23వేల మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించినట్లు ఎర్రబెల్లి చెప్పారు. ఈ నియోజకవర్గం ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి తాను ఈసారి లక్ష మెజార్టీతో గెలుస్తున్నానన్నారు. ప్రతి ఇంటికి పెన్షన్లు, రైతు బంధు పథకాలు అందుతున్నాయన్నారు. పాలకుర్తి ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే వారి ఇంట్లో ఉంటానని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో పాలకుర్తిలో ఆదుకున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు పాలకుర్తి గుడిని ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు మనం దీనిని అద్భుతంగా తయారు చేసుకున్నామన్నారు.

More Telugu News