KCR: ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాటలను మరోసారి గుర్తు చేసిన కేసీఆర్

KCR talks about revanth Reddy and Uttam Kumar Reddy comments
  • రైతుబంధు ఇస్తే డబ్బులు వృథా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారన్న కేసీఆర్
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్ అంటున్నారని విమర్శలు
  • బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమన్న ముఖ్యమంత్రి
  • ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచన
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, వారి బాగు కోసమని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా రావాల్సినంత పరిణతి రాలేదని, ఎన్నికలు అనగానే ఎందరో వస్తున్నారని... ఏవేవో మాట్లాడుతున్నారని, కానీ నియోజకవర్గం బాగు కోసం అందరూ ఓటు వేయాలన్నారు. ఇతరులు చెప్పింది విని ఆగమైతే అయిదేళ్లపాటు కష్టాలుపడక తప్పదని హెచ్చరించారు. ఓటు వేసే ముందు అన్నీ ఆలోచించాలన్నారు. నిజానిజాలు గమనించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరికి వేయాలో వారికి ఓటు వేయకుంటే అయిదేళ్లు శిక్ష తప్పదన్నారు. కాబట్టి ఎవరో చెప్పారని, నాలుగు డబ్బులు ఇచ్చారని, సీసాలు ఇచ్చారని ఓటు వేయవద్దన్నారు.

తెలంగాణను ఏపీలో కలిపి కాంగ్రెస్ తప్పు చేసిందన్నారు. ఈ తెలంగాణ రావడానికి మనం దశాబ్దాలుగా పోరాటం చేశామని చెప్పారు. తన ప్రజా ఆశీర్వాద సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారని, కానీ ఇలా వస్తే సరిపోదని ఈ నెల 30న ఓటు వేసి గెలిపించాలన్నారు. పాలకుర్తికి విమానంలో వచ్చి వెళ్లే వ్యక్తికి ఓటు వేస్తే లాభం లేదని, ఎర్రబెల్లి దయాకర రావును గెలిపించాలన్నారు. పదేళ్ల క్రితం పాలకుర్తి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నారు. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పాలకుర్తికి వచ్చి నాట్లు వేస్తున్నారన్నారు. పాలకుర్తిలో లక్షా 30వేల ఎకరాలకు సాగునీరు అందించినట్లు తెలిపారు.

రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ధ్వజమెత్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు రైతుబంధుతో కేసీఆర్ డబ్బులు దుబారా చేస్తున్నారని చెబుతున్నారన్నారు. ఇక బాధ్యత కలిగిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్ అంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే రైతుబంధు రూ.16వేలకు చేరుకుంటుందని, కానీ కాంగ్రెస్ గెలిస్తే ఉన్న రైతుబంధు పోతుందన్నారు. ఓటు వేసేవారు అభ్య‌ర్థుల గురించి మాత్ర‌మే కాదు.. వారి వెనుకున్న పార్టీల గురించి కూడా ఆలోచించాలని, న‌డ‌వ‌డిక చూడాలన్నారు. వారికి అధికారం ఇస్తే ఏం చేశారు? ఏం చేస్తారు? అనేది చూడాలన్నారు.
KCR
Errabelli
Telangana Assembly Election
Revanth Reddy
Congress

More Telugu News