Paras Mhambrey: సూర్యకుమార్ బౌలింగ్ చూసి స్పైడర్ క్యామ్‌కు ఏమవుతుందోనని భయపడిపోయిన కోచ్ మాంబ్రే

  • నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 9 మందితో బౌలింగ్ చేసిన రోహిత్
  • సూర్యకుమార్, గిల్ ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’లో ఉన్నారని మాంబ్రే వ్యాఖ్య
  • సూర్య బౌలింగ్ కోసం రెండేళ్లపాటు ఎదురుచూసినట్టు చెప్పిన బౌలింగ్ కోచ్
  • కొత్త బంతితో కోహ్లీ స్వింగ్ చేస్తాడని ప్రశంస
Team India Coach Paras Mhambrey Fears About Surya Bowling

ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించి అజేయంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సారథి రోహిత్‌శర్మ 9 మందితో బౌలింగ్ వేయించి రికార్డు సృష్టించాడు. స్వయంగా అతడు కూడా ఓ వికెట్ పడగొట్టాడు. బీసీసీఐ తాజాగా షేర్ చేసిన ఓ వీడియోలో జట్టు బౌలింగ్ ప్రదర్శనపై బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేను అడిగిన ప్రశ్నకు సంతోషం వ్యక్తం చేశాడు. 

పార్ట్ టైం బౌలర్లు ఫీల్డ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారని పేర్కొన్నాడు. తాము నిజాయతీగా మూడు విభాగాల (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) కోసం సన్నద్ధమవుతున్నట్టు చెప్పాడు. విరాట్ తీసిన వికెట్ అద్భుతమని కొనియాడాడు. విరాట్ కీపర్ వైపు చూడడం, లైన్‌లో మార్పు గురించి అతడు సూచించడాన్ని తాను చూశానని పేర్కొన్నాడు. విరాట్‌ను ఎలా ఉపయోగించుకోవాలో రోహిత్‌తో తాను ముందుగానే చాట్ చేసినట్టు చెప్పాడు. కొత్త బంతితో అతడు స్వింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. అయితే, మిడిల్ ఓవర్లలో ఎలా వేస్తాడన్నది తమ ముందున్న అతిపెద్ద సవాలని అన్నాడు. 

సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ గతంలో ఎక్కువగా బౌలింగ్ చేయలేదని, వారు ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’లో ఉన్నారని తెలిపారు. స్కిప్పర్ రోహిత్ సహా జట్టు మేనేజ్‌మెంట్ వారిని ఈ విభాగంలో వినియోగించుకోవాలని అనుకుంటోందని చెప్పాడు. ఒకానొక దశలో సూర్య ఫైటింగ్‌తో తాను స్పైడర్ క్యామ్‌కి ఏమవుతుందోనని భయపడ్డానని వ్యాఖ్యానించాడు. అదృష్టవశాత్తు అతడు దానిపైకి వెళ్లలేదని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

శుభమన్ ఎదుగుతున్నాడని తాను అనుకుంటున్నట్టు పేర్కొన్నాడు. వీరిద్దరితో కచ్చితంగా పని అవుతుందని చెప్పుకొచ్చాడు. సూర్య బౌలింగ్ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తుంటే రోహిత్ దానిని సాకారం చేశాడని, అతడి గ్లింప్స్‌ను చూడగలిగానని తెలిపాడు. విరాట్, శుభమన్ గిల్ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని, ఈ మ్యాచ్‌లో వారు బౌలింగ్ చేయగా చూడడం సంతోషంగా అనిపించిందని మాంబ్రే చెప్పుకొచ్చాడు.

More Telugu News