Suella Braverman: క్యాబినెట్ నుంచి హోం మంత్రి సువెల్లా బ్రెవెర్మన్ ను తొలగించిన రిషి సునాక్... ఎందుకంటే...!

  • లండన్ లో పాలస్తీనా అనుకూల వాదుల ర్యాలీ
  • పోలీసులు చూసీచూడనట్టు వదిలేశారంటూ సువెల్లా బ్రెవెర్మన్ ఆగ్రహం
  • హోంమంత్రి వ్యాఖ్యలతో లండన్ లో ఉద్రిక్తతలు
  • దిద్దుబాటు చర్యల్లో భాగంగా బ్రెవెర్మన్ పై వేటు వేసిన సునాక్
Rishi Sunak sacked Suella Braverman from cabinet

ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న సంక్షోభం బ్రిటన్ హోంమంత్రి సువెల్లా బ్రెవెర్మన్ పదవి పోవడానికి కారణమైంది. లండన్ లో పాలస్తీనా మద్దతుదారుల ప్రదర్శన పట్ల పోలీసులు ఉదారంగా వ్యవహరించారంటూ బ్రెవెర్మన్ ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆమె వ్యాఖ్యలతో లండన్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో, హోంమంత్రి పదవి నుంచి సువెల్లా బ్రెవెర్మన్ ను తొలగిస్తూ రిషి సునాక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

పాలస్తీనా అనుకూల వాదుల ర్యాలీని పోలీసులు చూసీచూడనట్లు వదిలేశారని, ఆ నిరసన ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమయ్యారని బ్రెవెర్మెన్ పోలీసులపై మండిపడినట్టు కథనాలు  వచ్చాయి. బ్రెవెర్మన్ వ్యాఖ్యలు మితవాద నిరసనకారులను రెచ్చగొట్టి లండన్ లో మరిన్ని ఆందోళనలకు దారితీశాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 

ఉద్రిక్తతలు మరింత భగ్గుమనక ముందే ప్రధాని రిషి సునాక్ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ క్రమంలోనే క్యాబినెట్ నుంచి బ్రెవెర్మన్ ను సాగనంపారు. అయితే, క్యాబినెట్ లో మార్పులు  చేర్పుల్లో భాగంగానే సువెల్లా బ్రెవెర్మన్ పదవిని కోల్పోయారని సునాక్ ప్రభుత్వం చెబుతోంది. కాగా, బ్రెవెర్మన్ స్థానంలో జేమ్స్ క్లెవర్లీ తదుపరి హోంమంత్రిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. 

43 ఏళ్ల సువెల్లా బ్రెవెర్మన్ భారత సంతతి బ్రిటన్ రాజకీయవేత్త. ఆమె పూర్వీకులు గోవాకు చెందినవారు.

More Telugu News