Tech-News: షుగర్ లెవల్స్ క్షీణించి, ఇంట్లో స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తిని కాపాడిన యాపిల్ వాచ్.. నిజంగా అద్భుతం

  • ఎమర్జెన్సీ నంబర్ 911కి డయల్ చేసిన యాపిల్ వాచ్
  • అదే వాచ్ నుంచి బాధితుడి తల్లికి ఎమర్జెన్సీ నోటిఫికేషన్
  • వాచ్ జీపీఎస్ ఆధారంగా లొకేషన్ గుర్తించడంతో సకాలంలో చికిత్స
apple watch saved a man who fainted at home due to low sugar levels

టైప్ 1 డయాబెటీస్‌తో బాధపడుతూ ఇంట్లో నిస్సహాయ స్థితిలో పడిపోయిన వ్యక్తిని ‘యాపిల్ వాచ్’ కాపాడిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది. జోష్ ఫర్మాన్ అనే 40 ఏళ్ల వ్యక్తి షుగర్ లెవల్స్ బాగా క్షీణించడంతో స్పృహ తప్పి ఇంట్లో పడిపోయాడు. తలకి బలమైన గాయం కూడా అయ్యింది. అయితే ఫర్మాన్ చేతికి ఉన్న యాపిల్ వాచ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని, మనిషి కింద పడిపోయాడని గుర్తించింది. వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ 911కి డయల్ చేసింది. అంతేకాదు బాధితుడి తల్లికి అలర్ట్ నోటిఫికేషన్ కూడా పంపించింది. మొత్తానికి యాపిల్ వాచ్ దయవల్ల ఫర్మాన్ ప్రాణాలు నిలబడ్డాయి.

టైప్ 1 డయాబెటీస్‌తో బాధపడుతున్న ఫర్మాన్ ఇటీవల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో స్పృహతప్పి పడిపోయారు. సాయం కావాలని ఎవరినీ అడిగే పరిస్థితిలో కూడా ఆయన లేరు. ఈ సమయంలో యాపిల్ వాచ్ 911కి కాల్ చేసింది. ఆపరేటర్ల నుంచి గొంతు వినిపిస్తున్నా ఫర్మాన్ మాట్లాడలేకపోయాడు. అయితే ఇదే యాపిల్ వాచ్‌లో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ జాబితాలో ఫర్మాన్ తన తల్లి కాంటాక్ట్‌ను ఉంచడంతో దానికి నోటీఫికేషన్ వెళ్లింది. ఆమె వెంటనే స్పందించి 911 కాల్ చేసి షుగర్ లెవల్స్ పడిపోయాయని తనకు నోటిఫికేషన్ వచ్చిందని వెల్లడించింది. దీంతో జీపీఎస్ లోకేషన్ ఆధారంగా 911 ఆపరేటర్లు తగిన వైద్యసాయం అందించారు. దీంతో ఫర్మాన్ ప్రాణాలతో బయటపడ్డాడు.

తాను ఎలా బయటపడ్డానో తనకు తెలియదని, ఆపిల్ వాచ్ 911కి డయల్ చేసిందనే విషయాన్ని సృహలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నానని ఫర్మాన్ చెప్పాడు. తాను మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో 911 ఆపరేటర్లు తాను చెప్పేది అర్థం చేసుకోలేకపోయారని, అయితే వాచ్ జీపీఎస్ సాయంతో తాను ఎక్కడ ఉన్నానో వారు గుర్తించగలిగారని వివరించాడు. కాగా ఫాల్ డిటెక్షన్ ఫీచర్ సాయంతో ఫర్మాన్ కిందపడిపోయిన విషయాన్ని వాచ్ గుర్తించింది.

More Telugu News