Airlines: విమాన టికెట్ రూ.114 మాత్రమే... మరీ ఇంత చవకా అనుకోవద్దు... అసలు విషయం ఇదే!

  • చైనా విమానయాన సంస్థ యాప్ లో సాంకేతిక లోపం
  • రెండు గంటల పాటు టికెట్ రేటు తక్కువగా చూపించిన యాప్
  • సాంకేతిక లోపం చోటుచేసుకున్నట్టు గుర్తించిన విమానయాన సంస్థ
  • తక్కువ రేటుకే టికెట్లు కొన్నవారిని కూడా అనుమతిస్తామని వెల్లడి
Technical default makes Southern Airlines customers to get tickets very cheap

గతంతో పోల్చితే చవక ధరల విమానయాన సంస్థలు రంగప్రవేశం చేయడంతో మధ్యతరగతి వారు కూడా విమాన ప్రయాణాలు చేసే వెసులుబాటు కలుగుతోంది. అయితే, విమాన టికెట్ కేవలం రూ.114 అంటే ఎవరూ నమ్మలేరు. ఎంత చవక అయినా గానీ మరీ ఇంత చవకా అనిపించకమానదు. 

అసలేం జరిగిందంటే...  చైనా సదరన్ ఎయిర్ లైన్స్ చవక ధరల విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. ఈ ఎయిర్ లైన్స్ సంస్థ గ్వాంగ్ ఝౌ ప్రావిన్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంది. 

అయితే, ఇటీవల సదరన్ ఎయిర్ లైన్స్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి బంపర్ చాన్స్ లభించింది. చైనాలోని ఛెంగ్డూ నగరం నుంచి బీజింగ్ కు టికెట్ ధర రూ.114 అని యాప్ లో కనిపించింది. వాస్తవానికి ఛెంగ్డూ-బీజింగ్ టికెట్ ధర రూ.5,700 వరకు ఉంటుంది. అలాంటిది కేవలం రూ.114కే టికెట్ లభిస్తుండడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. 

యాప్ లో ఈ టికెట్ రేటును స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం అందరికీ తెలిసిందే. దాంతో సదరన్ ఎయిర్ లైన్స్ అప్రమత్తమైంది. వెంటనే యాప్ ను పరిశీలించగా, సాంకేతిక లోపం కారణంగానే ధర అంత తక్కువగా చూపిస్తున్నట్టు గుర్తించింది. 

చైనా సదరన్ ఎయిర్ లైన్స్ మొబైల్ యాప్ లోనే కాదు, ట్రిప్ డాట్ కామ్ వంటి టికెట్ బుకింగ్ పోర్టల్ లోనూ ఇలాగే రూ.114కే టికెట్ అందుబాటులో ఉన్నట్టు కనిపించింది. దాదాపు రెండు గంటల పాటు ఇలా తక్కువ ధరకే టికెట్ అందుబాటులోకి వచ్చింది. 

అయితే, తక్కువ ధరకే టికెట్లు కొన్నవారిని కూడా ప్రయాణించేందుకు అనుమతిస్తామని, ఆ టికెట్లు చెల్లుబాటు అవుతాయని అంత నష్టంలోనూ సదరన్ ఎయిర్ లైన్స్ తియ్యని కబురు చెప్పింది.

More Telugu News