Himaja: బిగ్ బాస్ ఫేమ్ హిమజ అరెస్ట్ అంటూ వార్తలు... స్పందించిన హిమజ

  • ఇబ్రహీంపట్నంలో హిమజ ఇంట్లో రేవ్ పార్టీ అంటూ వార్తలు
  • హిమజ సహా 11 మంది అరెస్ట్ అని వెల్లడి
  • అరెస్టయిన వారిలో సినీ తారలు కూడా ఉన్నట్టు ప్రచారం
  • కొత్త ఇంట్లో దీపావళి వేడుకలు చేసుకుంటుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న హిమజ
Bigg Boss fame Himaja reacts on rumors

ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఓ రేవ్ పార్టీలో అరెస్టయినట్టు వార్తలు వస్తుండడం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జేబీ వెంచర్ లో ఉన్న హిమజ సొంత విల్లాలో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారని, హిమజ సహా 11 మందిని అరెస్ట్ చేశారని ఆ వార్తల్లో పేర్కొన్నారు. అంతేకాదు, మద్యం, సౌండ్ సిస్టమ్ లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 

హిమజ ఇంట్లో జరిగిన ఈ పార్టీకి సినీ తారలు కూడా వచ్చారని, పెద్ద సౌండ్ తో హంగామా చేస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై నటి హిమజ స్పందించారు. సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి తాను అరెస్ట్ కాలేదన్న విషయాన్ని చెప్పారు. 

తాను అరెస్ట్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అయితే తన నివాసానికి పోలీసులు వచ్చింది వాస్తవమేనని, వారు వచ్చి తనిఖీ చేసి వెళ్లిపోయారే తప్ప... కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం వంటివేవీ లేవని స్పష్టం చేశారు. కొత్త ఇంట్లో దీపావళి వేడుకల కోసం సన్నిహితులను పిలిచానని, పూజా కార్యక్రమాలు నిర్వహించానని హిమజ వెల్లడించారు. 

పోలీసులు వచ్చి ఏం జరుగుతోందని ఆరా తీశారని, వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారని, కానీ మీడియాలో మాత్రం ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను అరెస్ట్ అయ్యానన్న వార్తలతో ఫోన్లు మీద ఫోన్లు వస్తున్నాయని, అందరికీ వాస్తవం ఏంటో తెలియాలనే ఇలా లైవ్ లోకి వచ్చానని వివరణ ఇచ్చారు. ఇటువంటి తప్పుడు వార్తలు ఎందుకు ప్రచారం చేస్తారో అందరికీ తెలిసిందేనని అన్నారు. వీటి గురించి మాట్లాడడం కూడా వృథా అని పేర్కొన్నారు.

More Telugu News