Natti Kumar: జగన్ చిత్ర పరిశ్రమకు ఏం చేశారో పోసాని, అలీ సమాధానం చెప్పాలి: నట్టి కుమార్

  • అలీ, పోసానిలను లక్ష్యంగా చేసుకుని నట్టి కుమార్ విమర్శలు
  • ఏం చేస్తున్నాడని జగన్ ను పొగుడుతున్నారంటూ ఆగ్రహం
  • మీరేంటనేది ప్రజలకు అర్థమవుతుందని వ్యాఖ్య  
Natti Kumar take a swipe at Ali and Posani

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయినప్పటినుంచి టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. తాజాగా నట్టి కుమార్ నటులు, వైసీపీ నేతలు పోసాని కృష్ణమురళి, అలీలను టార్గెట్ చేశారు. జగన్ ను వేనోళ్ల పొగుడుతున్న అలీ, పోసాని... చిత్ర పరిశ్రమకు జగన్ ఏం చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఏం చేశారని జగన్ ను కీర్తిస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"నిన్న నేను ఒక వీడియో చూశాను. ఏపీలో పుట్టిన బిడ్డగా గర్విస్తున్నానని అలీ గారు ఆ వీడియోలో చెప్పారు. అవును... ఏపీలో పుట్టిన బిడ్డగా నేను కూడా గర్విస్తాను. అంతేకాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులన్నీ గర్వించదగ్గవే. కానీ వైఎస్సార్ వారసుడిగా జగన్ మోహన్ రెడ్డి ఏం చేశాడని అలీ ఆయను పొగుడుతున్నాడో చెప్పాలి. నేనడిగే ప్రశ్నలకు అలీ, పోసాని తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. 

నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే... అవును, మాకు సమాధానం చెప్పడం చేతకాలేదు అని అయినా చెప్పాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్పకపోతే మీరు ఏంటనేది ప్రజలు నూటికి నూరు శాతం నిర్ణయించుకుంటారు... మీరు ఒకరికే వత్తాసు పలుకుతున్నారన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. 

నాడు టికెట్ రేట్ల కోసం మీరు (అలీ, పోసాని), చిరంజీవి గారు, ఆర్.నారాయణమూర్తి గారు, రాజమౌళి గారు, ఇంకా మరికొందరు ఏపీ సీఎం జగన్ వద్దకు వెళ్లారు. ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీలోని వ్యక్తులు బాగుండాలి అని చిరంజీవి ఆ సమావేశంలో బతిమాలుకున్నాడో, వేడుకున్నాడో కానీ... అక్కడ సీఎం జగన్ కు చిరంజీవి రెండు చేతులు జోడించి దండం పెడుతున్న దృశ్యాల వీడియోను ఎందుకు విడుదల చేశారు? ఆ వీడియో విడుదల చేయడాన్ని మీరు ఎందుకు ఖండించలేదు? 

ఆ వీడియోతో ఇండస్ట్రీలో చిరంజీవి హుందాతనం ఎంతో పెరిగిపోయింది. కానీ, ఆ వీడియోను బయటికి తీసుకురావడాన్ని మీరు ఖండించకపోవడం వల్ల మీ విలువ తగ్గిపోయింది. 

సినిమా ఇండస్ట్రీ మన ప్రాణం, సినిమా ఇండస్ట్రీ మనది. మీరు కూడా ఇండస్ట్రీ వ్యక్తులే. పోసాని ఎఫ్ డీసీ చైర్మన్ గా ఉన్నారు. అలీ ఎలక్ట్రానిక్స్ మీడియా సలహాదారుగా ఉన్నారు. కానీ చిరంజీవి గారి మీద ఆ వీడియోను బయటికి పంపడం ఎంత వరకు కరెక్ట్ అనుకుంటున్నారు? 

మీరు సినిమా ఇండస్ట్రీకి ఏం చేశారు? జగన్ మోహన్ రెడ్డి నుంచి ఏం తాయిలాలు తీసుకువచ్చారు? మీ వల్ల ఇండస్ట్రీకి ఏమైనా రాయితీలు వచ్చాయా? మనం విశాఖలో ఏమైనా స్టూడియో కట్టగలిగామా? ఏపీలో షూటింగులు జరుపుకోవడానికి, ఇక్కడ్నించి ఏపీకి తరలి వెళ్లడానికి ఏమైనా అనుకూల వాతావరణం కల్పించగలిగారా?" అంటూ నట్టి కుమార్ ప్రశ్నాస్త్రాలు సంధించారు.

More Telugu News