Manda Krishna Madiga: మోదీ ధైర్యం ఇదీ... అలా చెప్పిన దమ్మున్న నేత ఆయన: ప్రధాని సామాజిక న్యాయంపై మంద కృష్ణ మాదిగ

  • బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ధైర్యంగా చెప్పిన నేత ప్రధాని మోదీ అని వ్యాఖ్య
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉపన్యాసాలు ఇస్తే మోదీ సామాజిక న్యాయం పాటిస్తున్నారన్న మంద కృష్ణ
  • మాదిగల సభకు మోదీ తప్ప ఏ ప్రధాని రాలేదన్న మంద కృష్ణ  
Manda Krishna madiga praises pm modi for bc cm promise

తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ధైర్యంగా ప్రకటించిన నేత ప్రధాని నరేంద్రమోదీ అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ... మన మాదిగల ఆవేదనలను... ఆకాంక్షలను గుర్తించేందుకు.. మన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చారన్నారు. 

ఓ వైపు ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో బిజీగా ఉన్నప్పటికీ మొన్న బీసీ ఆత్మగౌరవ సభకు వచ్చారని, ఇప్పుడు మన మాదిగ, ఉపకులాల విశ్వరూప సభకు వచ్చారన్నారు. ఇది మనం ఊహించనిదన్నారు. ఈ సమాజంలో చాన్నాళ్లు సిగ్గుపడ్డాం.. బాధపడ్డాం.. భయపడ్డామని, మమ్మల్ని అంటరానివారిగా చూసేవారని, కానీ ఇప్పుడు చైతన్యవంతులమయ్యామన్నారు. మా కులానికి ధైర్యాన్నిచ్చిన, అండగా ఉన్న మీకు థ్యాంక్స్ అన్నారు. ప్రధాని మనల్ని గుర్తించేందుకు.. మనల్ని గౌరవించేందుకు.. పెద్దన్నగా మన వద్దకు వచ్చారన్నారు.

వారు ఉపన్యాసాలు ఇస్తే.. మోదీ సామాజిక న్యాయం పాటిస్తున్నారు

ఈ దేశపు పెద్దన్న... మన జాతి పెద్దన్న ప్రధాని మోదీ అన్నారు. ఈ దేశంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడేది.. ఉపన్యాసాలు చేసేది కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే సామాజిక న్యాయాన్ని పాటించేది మాత్రం అన్నగారు మోదీయే అన్నారు. అందుకు సాక్ష్యాలు ఉన్నాయన్నారు. పేద కుటుంబం నుంచి.. ఛాయ్ అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చి ఈ దేశానికి ప్రధాని అయ్యారన్నారు. మోదీ బలహీనవర్గాల నుంచి ఎదిగారు కాబట్టే పేదరికం గురించి, బలహీనవర్గాల గురించి, అణగారిన వర్గాల గురించి ఆయనకు తెలుసునన్నారు.

మాదిగల సభకు మోదీ తప్ప ఏ ప్రధాని రాలేదు..

బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన దమ్మున్న నాయకుడు మోదీ అన్నారు. బీసీ బిడ్డగా ప్రధానిగా ఉంటూనే.. తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని ధైర్యంగా చెప్పారన్నారు. బీసీలు, పేదలు, మాదిగలు, మాదిగ ఉపకులాలకు అండగా ఉన్నానని చెప్పేందుకే మోదీ ఇక్కడకు వచ్చారన్నారు. మీ మనసులో మంచి ఆలోచన లేకుంటే మీరు ఇక్కడకు రాకపోయేవారన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని బీసీల మీటింగ్‌లకు, మాదిగల మీటింగ్‌లకు రాలేదన్నారు.

మోదీ సామాజిక న్యాయం...

ప్రధాని మోదీ సామాజిక న్యాయానికి ఎలా పెద్దపీట వేశారో ఆయన పరిపాలన చూస్తే తెలుస్తుందన్నారు. ఆయన తొలిసారి ప్రధాని కాగానే దళితుడిని రాష్ట్రపతిగా చేశారని, రెండోసారి ప్రధాని కాగానే ఆదివాసి గిరిజన బిడ్డను రాష్ట్రపతిగా చేశారని గుర్తు చేశారు. ఇలా చేయడం కాంగ్రెస్ సహా ఎవరికీ సాధ్యం కాదన్నారు. మోదీ బీసీ కాబట్టి.. ఆయన ఓ దళితుడిని, గిరిజన యువతిని పైకి తీసుకు వచ్చారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిగలకు న్యాయం చేశాయా? అని ప్రశ్నించారు. 

కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేసిన వారిలో నేనూ ఒకడినని, తెలంగాణలో మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, కానీ కేసీఆర్ ప్రభుత్వంలో 18 మంత్రులకు ఒక్క మాదిగ మంత్రి లేడన్నారు. కానీ జనాభాలో ఒక శాతం కూడా లేని వెలమలు మాత్రం నలుగురు ఉన్నారని, రెడ్డి మంత్రులు ఏడుగురు ఉన్నారన్నారు. కానీ ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత దక్కిందన్నారు. తమిళనాడులో తమ్ముడు మురుగన్ వెయ్యి ఓట్లతో ఓడిపోయినప్పటికీ ప్రధాని మోదీ ఆయనను రాజ్యసభకు పంపించి కేంద్రమంత్రిగా చేశారన్నారు. కేసీఆర్ మాత్రం మాదిగలను అణచివేశారన్నారు. సామాజిక న్యాయం మాటలు చెప్పడం.. ప్రసంగాలు చేయడం కాదని, మోదీలా అమలు చేయడమన్నారు.

అసమానతల విషయానికి వస్తే.. ఇవి ఎక్కడ ఉంటే ప్రధాని మోదీ అక్కడకు వెళ్తున్నారని మంద కృష్ణ మాదిగ అన్నారు. పండిట్ దీన్ దయాల్ జీ ఆలోచనలకు అనుగుణంగా అంత్యోదయ, అంబేడ్కర్ చెప్పినట్లుగా సామాజిక న్యాయం, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్, ముస్లీం మహిళల బాధలు అర్థం చేసుకొని ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళలకు రిజర్వేషన్లు... ఇలా ప్రధాని మోదీ ఎన్నో అసమానతలను రూపుమాపుతున్నారన్నారు. మహిళలు, పేదలు, అట్టడుగు వర్గాల విషయంలో అంబేడ్కర్ ఆలోచనలను మోదీ అమలు చేస్తున్నారన్నారు.

More Telugu News