Mohan Babu: చంద్రమోహన్ మృతి... న్యూజిలాండ్ నుంచి మోహన్ బాబు భావోద్వేగ స్పందన

  • తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం
  • తీవ్ర అనారోగ్యంతో చంద్రమోహన్ కన్నుమూత
  • ఆత్మీయుడ్ని కోల్పోయానన్న మోహన్ బాబు
  • వయసులో తనకంటే పెద్దవాడైనా ఒరేయ్ అని పిలిచేవాడ్నని వెల్లడి
Mohan Babu emotional reaction after heard Chandramohan death

సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

చంద్రమోహన్ మృతి పట్ల అగ్రనటుడు మోహన్ బాబు భావోద్వేగాలతో స్పందించారు. మోహన్ బాబు ప్రస్తుతం 'కన్నప్ప' చిత్రం షూటింగ్ కోసం న్యూజిలాండ్ లో ఉన్నారు. చంద్రమోహన్ మరణవార్త తెలియగానే తీవ్ర విచారానికి గురయ్యానని వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం వెలువరించారు. 

"1966లో నేను కాలేజీలో చదువుతున్న రోజులవి. ఆ సమయంలో చంద్రమోహన్ నటించిన రంగులరాట్నం చిత్రం రిలీజైంది. ఆ సినిమా నాకు ఎంతగానో నచ్చింది. అప్పట్నించి చంద్రమోహన్ అంటే అభిమానం. ఆ తర్వాత నేను సినిమాల్లోకి వచ్చాను. 

మొదట్లో నేను అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాను. చంద్రమోహన్ హీరోగా ఉన్న సినిమాలకు కూడా నేను దర్శకత్వ విభాగంలో పనిచేశాను. అప్పుడే చంద్రమోహన్ తో పరిచయం ఏర్పడింది. తర్వాత కాలంలో చంద్రమోహన్ మా సొంత బ్యానర్లో నటించాడు. నాతో అల్లుడు గారు, రాయలసీమ రామన్న చౌదరి, విష్ణుతో ఢీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. బయటి చిత్రాల్లో కూడా మేమిద్దరం కలిసి నటించాం. 

చంద్రమోహన్ గొప్ప నటుడు, మనసున్న వ్యక్తి. నాకెంతో ఆత్మీయుడు. వయసులో నాకంటే పెద్దవాడు. అయినప్పటికీ, ఒరేయ్... ఒరేయ్ అని పిలుచుకునే చనువు మా మధ్య ఉండేది. అటువంటి ఆత్మీయుడు ఇవాళ లేడు. చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని, అతడి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను" అని మోహన్ బాబు తెలిపారు.

More Telugu News