sarpanch navya: అందుకే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను: నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ నవ్య

  • స్టేషన్ ఘనపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
  • రాజకీయంగా ఎదిగే ఉద్దేశం, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పోటీ చేస్తున్నట్లు వెల్లడి
  • ఓ కుటుంబంలో వ్యక్తిలా తనను ఆశీర్వదిస్తారని ఆశాభావం
Sarpanch Navya files nomination for station ghanpur

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై గతంలో ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె శుక్రవారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారి వద్ద చివరి రోజైన శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తనకు బీఆర్ఎస్ నుంచి అవకాశమిస్తే పోటీ చేస్తానని ఆమె గతంలో చెప్పారు. ఇక్కడి నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. దీంతో సర్పంచ్ నవ్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను ఓ వార్డు మెంబర్‌గా... ఆ తర్వాత సర్పంచ్‌గా గెలిచానని, ఇప్పుడు ఎమ్మెల్యే కోసం నామినేషన్ దాఖలు చేశానన్నారు. తనకు ఎవరి మీద పగ, కోపం లేవన్నారు. రాజకీయంగా ఎదిగే ఉద్దేశం, అలాగే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. దేశంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఇది మహిళలకూ వర్తిస్తుందన్నారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని, అందుకే తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా తనను ఓ అక్కలా... చెల్లిలా.. తమ కుటుంబంలో ఓ వ్యక్తిగా ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్టేషన్ ఘనపూర్‌లోని అన్ని నియోజకవర్గాలకు వెళ్లి తాను ప్రచారం చేస్తానన్నారు. ఏ గ్రామంలో... ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటానన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలన్నారు. తాను నామినేషన్ వేసింది మాత్రం వంద శాతం రాజకీయం చేయడం కోసమే అన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.

More Telugu News