V Hanumantha Rao: ఎవరికి వారే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు... ఇక ఆపేయండి!: కామారెడ్డి సభలో వీహెచ్

VH on congress leaders chief minister comments
  • ముందు పార్టీని గెలిపించాలి.. ఆ తర్వాత అధిష్ఠానం నిర్ణయిస్తుందన్న వీహెచ్
  • ఇప్పటికైనా ఈ అంశంపై చర్చ ఆపేయాలని సూచన
  • రేవంత్ రెడ్డి రెండుచోట్ల గెలిచాక కొడంగల్‌ను వదిలేయాలన్న వీహెచ్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి... రెండు నియోజకవర్గాలలో గెలుస్తాడని, కానీ ఆయన గెలిచిన తర్వాత కొడంగల్‌ను వదిలిపెట్టి, కామారెడ్డిలోనే ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర - బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం సమయంలో కోదండరాం కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తే క్రెడిట్ కేసీఆర్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం మేం కూడా కొట్లాడామన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, ఆయన కుటుంబం నాంపల్లి దర్గా వద్ద కూర్చొని అల్లాకే నామ్ పే దేదా బాబా... అని అడుక్కునే వారన్నారు. బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ.. తాము 52 శాతానికి పైగా ఉన్నామని, కాస్త లెక్కతో నిధులు ఇవ్వాలన్నారు.

తాను చివరగా ఓ రిక్వెస్ట్ చేస్తున్నానని, ఎవరికి వారే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారని, ఇందుకు తనకు బాధగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. 1999లో కూడా మీరు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా? అని తనను అడిగితే అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పానన్నారు. ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది సోనియా, రాహుల్, వేణుగోపాల్ అన్నారు. ఎవరికి వారే ముఖ్యమంత్రులం అని చెప్పుకుంటే మనలో యూనిటీ లేదని చెబుతారని అప్రమత్తం చేశారు. మొదట ఎన్నికల్లో గెలవండి... ప్రజలు ఓట్లు వేశాక... సోనియా, రాహుల్ ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. పని చేసే వారికి, ప్రజల్లో అభిమానం ఉన్న వారికి అవకాశం ఇస్తారన్నారు. ముఖ్యమంత్రి అంశంపై చర్చ ఇప్పటికైనా ఆపేయాలని సూచించారు.
V Hanumantha Rao
Congress
Telangana Assembly Election
Revanth Reddy

More Telugu News