Tamil Nadu: తమిళనాడులో కుండపోత వర్షాలు... స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

  • చురుగ్గా కదులుతున్న ఈశాన్య రుతుపవనాలు
  • తమిళనాడులోని పలు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు
  • అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం
  • నేడు, రేపు వర్ష సూచన
Heavy rains lashes Tamil Nadu districts

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల వరదలు సంభవించాయి. 

మధురై, కోయంబత్తూరు, దిండిగల్, తేని, తిరువూర్ జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండడంతో భయాందోళనలు నెలకొన్నాయి. 

కాగా, తిరునల్వేలి, తిరువారూర్, రామనాథపురం, తంజావూరు, నాగపట్నం, కన్యాకుమారి, తూత్తుకుడి, టెంకాశీ, విరుదునగర్, పుదుకోట్టై, తిరునల్వేలి, శివగంగై, మైలదుత్తురై జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటికి కూడా ఇదే వాతావరణ హెచ్చరిక వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, తమిళనాడులోని పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. 

నీలగిరి ప్రాంతంలో కల్లోర్, కూనూరు సెక్షన్ల మధ్య రైలు పట్టాలపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండడం, ట్రాక్ పై కొండచరియలు, చెట్లు విరిగిపడడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. రెండు పాసింజర్ రైళ్లను ఈ నెల 16 వరకు రద్దు చేశారు. నీలగిరి జిల్లాలోని ఐదు తాలూకాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది.

More Telugu News