Pakistan: పాకిస్థాన్ ఇలా చేస్తే సెమీస్‌ బెర్త్ పక్కా.. వసీం అక్రం వ్యంగ్య సలహా!

Pak will Go to Semi Finals If They Do This Akram Gave Superb Idea
  • పాక్ సెమీస్ ఆశలు దాదాపు సమాధి
  • ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేయాలన్న అక్రం
  • ఆ తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఇంగ్లిష్ ఆటగాళ్లను లాక్ చేస్తే టైమ్‌డ్ అవుట్ అవుతారని సలహా
ప్రపంచకప్ సెమీస్‌లోకి దూసుకెళ్లాలన్న పాక్ ఆశలను నిన్న న్యూజిలాండ్ చెరిపేసింది. శ్రీలంకపై కివీస్ ఘన విజయం సాధించడంతో పాక్ కథ దాదాపు ముగిసింది. ఏదో పెద్ద అద్భుతం జరిగితే తప్ప పాక్ ఇంటికెళ్లడం ఖరారైంది. పాకిస్థాన్ సెమీఫైనల్లో కాలుమోపాలంటే ఇంగ్లండ్‌పై కనీసం 280 పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే ఆ టార్గెట్‌ను ఐదు ఓవర్లలోనే అందుకోవాల్సి ఉంటుంది. ఈ రెండూ అసాధ్యం కాబట్టి పాకిస్థాన్ మూటముల్లె సర్దుకోవాల్సిందే. 

పరిస్థితులు ఇలా ఉంటే, తాను చెప్పినట్టు చేస్తే పాక్ సెమీస్‌కు వెళ్తుందంటూ ఆ జట్టు మాజీ పేసర్ వసీం అక్రం అద్భుతమైన సరదా సలహా ఇచ్చాడు. పాక్ టీవీ చానల్ ‘ఎ స్పోర్ట్స్‘ టాక్ షోలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‌కు దిగి లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత.. ఇంగ్లండ్ ఆటగాళ్లను క్రీజులోకి రానివ్వకుండా డ్రెస్సింగ్ రూములోనే ఉంచి 20 నిమిషాలపాటు తాళం వేస్తే.. అప్పుడు వారు టైమ్‌డ్ అవుట్ అవుతారని, అప్పుడు ఎంచక్కా భారీ తేడాతో గెలిచి సెమీస్‌కు చేరొచ్చంటూ చేసిన సూచన వైరల్ అవుతోంది. 
 
ఇదే షోలో పాల్గొన్న మిస్బా వెంటనే కలగజేసుకుని మరో సూపర్ ఐడియా కూడా ఇచ్చాడు. ఇంగ్లండ్ జట్టు కనుక ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. అప్పుడే వారిని డ్రెస్సింగ్ రూంలో ఉంచి లాక్ చేస్తే అసలు లక్ష్యమనేదే ఉండదని చెబుతూ నవ్వులు పూయించాడు.
Pakistan
England
World Cup
Wasim Akram

More Telugu News