Airports: ఖలిస్థాన్ ఉగ్రవాది బెదిరింపులతో ఢిల్లీ, పంజాబ్ ఎయిర్ పోర్టుల్లో ఆంక్షలు

  • కెనడాలో హత్యకు గురైన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ 
  • భారత్ ను వేలెత్తి చూపిస్తున్న కెనడా
  • కెనడా గడ్డపై నుంచి హూంకరిస్తున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులు
Entry passes issuing stopped in Delhi and all Punjab airports after Khalistan threats

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన తర్వాత కెనడా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ హత్య వెనుక భారత నిఘా సంస్థ 'రా' ఏజెంట్ల హస్తం ఉందని నమ్ముతున్న కెనడా... భారత కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉంది. కెనడా గడ్డపై వేళ్లూనుకుపోయిన ఖలిస్థానీ ఉద్యమకారులు కూడా భారత్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. 

ఈ క్రమంలో, ఖలిస్థాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ చేసిన హెచ్చరికలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. నవంబరు 19న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారి ప్రాణాలకు ముప్పు తప్పదని, ఆ రోజున ఏమైనా జరగొచ్చని పన్నూ ఇటీవల ఓ ప్రకటన చేశాడు. ఎయిరిండియా విమానాలను ప్రతి చోటా అడ్డుకుంటామని స్పష్టం చేశాడు. 

ఈ నేపథ్యంలో, ఢిల్లీ, పంజాబ్ ఎయిర్ పోర్టుల్లో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పంజాబ్ లోని అన్ని ఎయిర్ పోర్టుల్లో సందర్శకులకు ఎంట్రీ పాస్ లు జారీ చేయడం తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. నవంబరు 30 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అయితే, ఈ ఎంట్రీ పాస్ లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది.

More Telugu News