Cricket: మ్యాక్స్‌వెల్ అజేయ డబుల్ సెంచరీపై వసీం అక్రమ్ స్పందన..

  • దిగ్గజాల ప్రదర్శన చేశాడంటూ అక్రమ్ కితాబు
  • మ్యాక్స్‌వెల్ నమ్మశక్యంకాని ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసల జల్లు
  • 40 ఏళ్ల క్రికెట్‌లో ఇలాంటి ఇన్నింగ్స్ చూడలేదని వ్యాఖ్య
Wasim Akram reacts on Maxwells unbeaten double century against Afghanistan

ఆఫ్ఘనిస్థాన్‌‌పై అజేయ డబుల్ సెంచరీతో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మెన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా పాకిస్థాన్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ స్పందించాడు. ఏమాత్రం నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఇది అని అక్రమ్ వ్యాఖ్యానించాడు. వన్ మ్యాన్ షో చేశాడని, దిగ్గజాల ఆట ఆడాడని అక్రమ్ పొగిడాడు. పాకిస్థాన్ స్పోర్ట్స్ ఛానెల్ ‘ఏ’ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ అక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒకే వ్యక్తి మ్యాచ్ గెలిపించడం కష్టమనే సామెత ఉందని, అది అబద్ధమని తేలిపోయిందని వ్యాఖ్యానించాడు. నమ్మలేని పరిస్థితి నుంచి ఒక వ్యక్తి మ్యాచ్‌ను గెలిపించగలడని చూశామని మ్యాక్స్‌వెల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 

జట్టు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆడాలనే గొప్ప సంకల్పం ఉండాలని, ఆ పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో దిగ్గజాలను అడిగితే తెలుస్తుందని వసీం అక్రమ్ వ్యాఖ్యానించాడు. మ్యాక్స్‌వెల్‌కు అవగాహనతో చక్కటి భాగస్వామ్యం అందించిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ను కూడా మెచ్చుకోవాలని అక్రమ్ అన్నాడు. 68 బంతులను ఎదుర్కొన్నాడని, మ్యాక్స్‌వెల్‌కి స్ట్రయికింగ్ ఇచ్చి సహకరించాడని అన్నాడు. తన 40 ఏళ్ల క్రికెట్‌లో ఇలాంటి ఇన్నింగ్స్‌ను ఎప్పుడూ చూడలేదని వసీం అక్రమ్ పేర్కొన్నాడు. కాగా మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో 292 పరుగుల రికార్డును ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 91 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ డబుల్ సెంచరీ కొట్టి జట్టుని గెలిపించిన విషయం తెలిసిందే.

More Telugu News