Cricket: సెమీఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా.. రసవత్తరంగా మారిన నాలుగవ స్థానం.. 3 జట్ల మధ్య పోటీ

  • న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌కు సమాన అవకాశాలు
  • లీగ్ దశలో చివరి మ్యాచ్‌ ఫలితాల ఆధారంగా ఖరారు కానున్న చివరి సెమీస్ బెర్త్
  • అనూహ్యంగా మూడు జట్లూ గెలిచినా, ఓడినా కీలకం కానున్న నెట్ రన్‌రేట్
Afghanistan Loss leads competition For semis berth between Pakistan And New Zealand in World Cup 2023

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో మంగళవారం సంచలనం నమోదయ్యింది. ముంబై వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌పై ఆస్ట్రేలియా చిరస్మరణీయం విజయం సాధించింది. 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ కేవలం 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోవడంతో ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ స్టార్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన బ్యాటింగ్‌తో అద్భుతం చేసి ఆస్ట్రేలియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. డబుల్ సెంచరీతో ఎప్పటికీ గుర్తుండిపోయే గెలుపుని అందించాడు. దీంతో కంగారూలు సెమీఫైనల్ స్థానాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. అయితే ఆస్ట్రేలియాలో చేతిలో ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోవడంతో నాలుగవ సెమీస్ బెర్త్‌ మరింత రసవత్తరంగా మారింది. 

పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ మూడు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి నాలుగు చొప్పున గెలుపులతో సమానమైన పాయింట్లతో ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా న్యూజిలాండ్ 4వ స్థానంలో, పాకిస్థాన్ 5వ ప్లేస్, ఆఫ్ఘనిస్థాన్ 6వ స్థానాల్లో ఉన్నాయి. గ్రూపు దశలో ఈ మూడు ఒక్కొక్క మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. సాధించే విజయాన్ని బట్టి 3 జట్లకూ సెమీఫైనల్ అవకాశం ఉంది. ఒకవేళ మూడు జట్లూ తమ చివరి మ్యాచ్‌లలో గెలిస్తే 10 పాయింట్లతో మళ్లీ సమానంగానే ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీ ఫైనల్ చేరుకునే జట్టుని నిర్ణయిస్తారు. ప్రస్తుతానికైతే న్యూజిలాండ్ మెరుగైన రన్‌రేటుతో కనిపిస్తోంది. అనూహ్యంగా 3 జట్లూ తమ చివరి మ్యాచ్‌లో ఓడినా నెట్ రన్‌రేట్ కీలకం కానుంది.

ఇదిలావుండగా ప్రస్తుతం భారత్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 12 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో, 12 పాయింట్లతో ఆస్ట్రేలియా 3వ స్థానంలో ఉన్నాయి. ఈ మూడు జట్లు సెమీఫైనల్‌కి అర్హత సాధించాయి.

More Telugu News