Nara Lokesh: వైసీపీ ఖాతాలోకి ఆ రూ.150 కోట్లు ఎలా వచ్చాయి?: నారా లోకేశ్

  • గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు
  • ఏపీలో అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి
  • 8 పేజీల సుదీర్ఘ లేఖ అందజేత
  • చంద్రబాబును ఎలా జైలుకు పంపారో గవర్నర్ కు వివరించామన్న లోకేశ్
Nara Lokesh talks to media after meeting Governor

టీడీపీ నేతలు ఇవాళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై లేఖ సమర్పించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ  సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విజయవాడలో రాజ్ భవన్ కు తరలి వెళ్లారు. గవర్నర్ కు 8 పేజీల లేఖను అందించి, రాష్ట్రంలో అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుపై ఆధారాల్లేక పోయినా, 17ఏ అనుమతి లేకపోయినా దొంగ కేసులు పెట్టి ఎలా సతాయించారో, జ్యుడీషియల్ రిమాండ్ కు ఎలా పంపారో గవర్నర్ కు వివరించినట్టు తెలిపారు


ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు!

స్కిల్ కేసులో తొలుత రూ.3 వేల కోట్లు అవినీతి అన్నారు, తర్వాత రూ.370 కోట్లు అన్నారు, ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు. అది కూడా పార్టీ అకౌంట్ లో పడ్డాయని చెప్పి ఎలా ఇబ్బంది పెట్టారో చూశాం. సామాన్య ప్రజలకు ముఖ్యమంత్రి సైకో అని అర్థమైంది, ఏ తప్పుచేయని చంద్రబాబుపై చివరకు రూ.27 కోట్లు పార్టీ అకౌంట్ కు వచ్చిందని ఆరోపణలు చేస్తున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిపై రూ.27 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తారు, అది కూడా ఎలక్టోరల్ బాండ్లు గురించి, ఎవరైనా వింటే నవ్విపోరా? 2014 నుంచి వైసీపీ ఖాతాలోకి రూ.150 కోట్లు ఎలా వచ్చాయి, వారికి ఎలాంటి ఖర్చులు లేవా?

తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం!

17ఏ చట్టానికి 2018లో సవరణ వచ్చింది, చంద్రబాబుపై కేసు విషయంలో పర్మిషన్ తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదని గవర్నర్ కు చెప్పాం... వివరాలన్నీ తెప్పించుకుంటామని ఆయన చెప్పారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు, 10వ తేదీనుంచి రెగ్యులర్ బెయిల్ పై విచారణ ఉంది. తీర్పులను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వంలో దొంగ కేసులు పెట్టడం ఆనవాయతీగా మారింది. రాష్టస్థాయి నుంచి గ్రామ కార్యకర్త వరకు కేసులు పెడుతున్నారు, న్యాయపోరాటం చేస్తాం. టీడీపీ కార్యకర్తలకు న్యాయసహాయం అందిస్తున్నాం, కార్యకర్తలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది, కాపాడుకుంటాం. ఈ వ్యవహారాలను నేను, అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాం.

రేపు ఎన్నికల కమిషన్ ను కలుస్తాం!

రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవతకతవకలపై రేపు టీడీపీ బృందం ఎన్నికల కమిషన్ ను కలుస్తుంది. ఈసీకి 6 లేఖలు ఇస్తాం, తప్పుల తడక ఓటరు లిస్టుపై ఫిర్యాదు చేస్తాం దొంగ ఓట్లపై మేం పోరాడతాం, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతాం. డిల్లీకి కూడా వెళ్లి పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి ఫోటోతో  కూడా దొంగ ఓటు ఉంది. రాష్ట్రంలో 2019 నుంచి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది.

నాయకులంతా ప్రజల్లోనే ఉన్నాం!

ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులందరం ప్రజల్లో ఉన్నాం, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై ఇంటింటికీ తిరుగుతున్నాం, ప్రతిపక్ష నేతలపై దాడులను కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెబుతున్నాం. జేఏసీ మీటింగ్ లో కూడా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను జనసేనకు వివరించాం... చాలా బాగున్నాయని అన్నారు, పవన్ కొన్ని అదనంగా సూచించారు. వాటిపై జేఏసీ మీటింగ్ లో చర్చిస్తాం. రాష్ట్రంలో కరవు తీవ్రంగా ఉంది, రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది, పశ్చిమ ప్రాంతంలో తాగునీటికి కటకటలాడుతున్నారు, దీనిపై ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నాం అని లోకేశ్ తెలిపారు. 

More Telugu News