Nara Lokesh: దొంగోడి నుంచి మంచి పరిపాలన ఎలా వస్తుంది సామీ!: నారా లోకేశ్

Nara Lokesh complains against state govt to Governor
  • లోకేశ్ ఆధ్వర్యంలో గవర్నర్ ను కలిసిన టీడీపీ బృందం
  • గవర్నర్ కు 8 పేజీల లేఖ అందజేత
  • గవర్నర్ తో దాదాపు గంటకు పైగా భేటీ
  • రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. పార్టీ నేతలతో కలిసి విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లిన నారా లోకేశ్ గవర్నర్ కు 8 పేజీల లేఖను అందించారు. అందులో చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతలపై ఇప్పటివరకు నమోదు చేసిన కేసుల వివరాలు కూడా ఉన్నాయి. 

ఏపీలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని లోకేశ్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో దాదాపు గంటకు పైగా సమావేశమైన లోకేశ్ రాష్ట్రంలోని పరిస్థితులను సమగ్రంగా వివరించారు.  

వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజల పక్షాన గొంతుక వినిపిస్తున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ, జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన ఏ ఒక్క కేసులోనూ ఆధారాలు లేవని, ఆయనను ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలన్నదే వారి కుట్ర అని లోకేశ్ గవర్నర్ కు వివరించారు. రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన జరుగుతోందని వెల్లడించారు. 

గవర్నర్ ను కలిసిన అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును ఏ ఆధారాలు లేకపోయినా అన్యాయంగా 53 రోజులు జైల్లో ఉంచిన వైనాన్ని గవర్నర్ కు వివరించామని తెలిపారు. అంతేకాదు, చంద్రబాబు అరెస్ట్  వేళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను రాష్ట్రానికి రానివ్వకుండా అడ్డుకున్న వైనాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాష్ట్రంలో దళితులపై దాడి ఘటనలను కూడా గవర్నర్ కు వివరించామని అన్నారు. 

కక్ష సాధింపు రాజకీయాలకు అడ్డుకట్ట వేసేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 అనుసరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరామని లోకేశ్ వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ మహిళ పేరుతో సీఎం ఫొటోతో ఓటు ఉన్న విషయాన్ని లోకేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన ఫొటోలపైనే దొంగ ఓట్లు ఉన్నాయంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

38 కేసుల్లో బెయిల్ పై తిరుగుతున్న దొంగోడు దొంగ పనులు కాక ఇంకేం చేస్తాడని ఎద్దేవా చేశారు. దొంగోడి నుంచి మంచి పరిపాలన ఆశిస్తున్నారా... భలేవాడివి సామీ అంటూ ఓ విలేకరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సొంత బాబాయ్ ని లేపేసిన వ్యక్తి జగన్... అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు సీబీఐని రాష్ట్రానికి రాకుండా చేశారని లోకేశ్ ఆరోపించారు.

కాగా, లోకేశ్ తో పాటు గవర్నర్ ను కలిసిన వారిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు పీతల సుజాత, కొల్లు రవీంద్ర, పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉన్నారు.
Nara Lokesh
Governor
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News