Atchannaidu: ఏపీలో దళితులపై దమనకాండ కేంద్రానికి కనిపించడంలేదా?: అచ్చెన్నాయుడు

Atchannaidu attends Dalit meeting in TDP Office
  • టీడీపీ కార్యాలయంలో దళితులంతా బాబుతోనే కార్యక్రమం
  • దళిత సమ్మేళన సభకు హాజరైన టీడీపీ దళిత నేతలు
  • ఎస్సీలు జగన్ కు ఎందుకు ఓటేయాలో ఆలోచించుకోవాలన్న అచ్చెన్నాయుడు
టీడీపీ జాతీయ కార్యాలయంలో నేడు ‘దళితులంతా బాబుతోనే' పేరిట దళిత సమ్మేళన సభ నిర్వహించారు. జగన్ రెడ్డి పాలనలో దళితులపై ఊచకోత జరుగుతోందని, సీఎం జగన్ ఒకపక్క ఊచకోత సాగిస్తూ, మరోపక్క నా ఎస్సీలు అనే జపం చేస్తున్నాడని ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ దళిత నేతలు మండిపడ్డారు. మరలా జగన్ ముఖ్యమంత్రి అయితే దళితులు రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితులు ఉంటాయని అన్నారు. 

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు, కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో ఉన్న దళిత మేధావులు, దళిత సంఘాలు దళితుల పక్షాన నిలవకుండా... వారికి అండగా నిలవకుండా ఏం చేస్తున్నాయి? అని అడిగారు. ఎస్సీలంతా జగన్ రెడ్డికి ఎందుకు ఓట్లేయాలో ఆలోచించుకోవాలని సూచించారు. 

“తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కడా చిన్న తప్పుచేయకుండా, నీతి నిజాయతీలే ఊపిరిగా, ప్రజాభిమానమే సంపదగా బతికిన చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసు పెట్టి, 52 రోజుల పాటు అన్యాయంగా జైల్లో బంధించిన విషయం మనం ఎప్పటికీ మర్చిపోలేం. తెలుగుదేశం పార్టీ రాకముందు దళితులు.. బీసీలు.. మైనారిటీలను అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయి. 

స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించాకే... దళిత, బీసీ, మైనారిటీ వర్గాలకు... ముఖ్యంగా చెప్పాలంటే దళిత వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు లభించాయి. దళితుల్ని రాష్ట్రంలో, దేశంలో  అగ్రస్థానంలో నిలపడానికి చంద్రబాబు ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు. 

చంద్రబాబు దళితుల కోసం అమలుచేసిన 27పథకాలు రద్దుచేయడమేనా జగన్ దళితులకు చేసిన మంచి? జగన్ రెడ్డికి చెంచాలుగా పనిచేసే దళిత.. బీసీ, మైనారిటీ నాయకులు తప్ప రాష్ట్ర్రంలోని ప్రతి ఒక్కరూ చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన గొప్పతనం ప్రజలకు అర్థమైంది. ఆయన్ని  ప్రజలు ఎంతగా నమ్మారో చెప్పడానికి ఆయన జైలు నుంచి విడుదలైన రోజు సాగిన సుదీర్ఘ రోడ్డు ప్రయాణమే నిదర్శనం" అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమానికి వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, కేఎస్ జవహర్, ఉండవల్లి శ్రీదేవి, బాలవీరాంజనేయస్వామి, తంగిరాల సౌమ్య, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తదితరులు హాజరయ్యారు.
Atchannaidu
TDP
Chandrababu
Jagan
YSRCP

More Telugu News