Cricket: దక్షిణాఫ్రికాపై భారత్ సాధించిన ఘనవిజయంపై వసీమ్ అక్రమ్ స్పందన

  • భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని ప్రశంసలు
  • ఫస్ట్ బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా సంపూర్ణ నియంత్రణ సాధిస్తున్నారని పొగడ్తలు
  • భారత్, ఇతర జట్ల పోటీ న్యాయబద్ధంగా ఉండాలంటూ సరదా వ్యాఖ్యలు
Wasim Akram reacts to Indias massive win over South Africa

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించిన టీమిండియాపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ ప్రశంసలు జల్లు కురిపించాడు. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్‌లో భారత్, ఇతర దేశాల మధ్య మ్యాచ్‌ల్లో పోటీ న్యాయబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చమత్కరించాడు. భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని మెచ్చుకున్నాడు. 

భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నాడు. ఫస్ట్  బ్యాటింగ్ చేసినా, ముందుగా ఫీల్డింగ్ చేసినా మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధిస్తున్నారని, దక్షిణాఫ్రికా ప్రదర్శనపై కొత్తగా చెప్పేదేముందని అక్రమ్ వ్యాఖ్యానించాడు. అద్భుతంగా ఆడి సెంచరీ చేసిన విరాట్ కోహ్లీని అక్రమ్ అభినందించాడు. ఆధునిక కాలపు ‘గ్రేట్’గా కోహ్లీని తాము పిలుస్తామని, అది నిరూపించుకుంటున్నాడని వ్యాఖ్యానించాడు. కాగా పుట్టినరోజు నాడే కోహ్లీ కెరీర్‌లో 49వ వన్డే సెంచరీని సాధించిన విషయం తెలిసిందే.

ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ ఏకంగా 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించడంపై అక్రమ్ స్పందించాడు. దక్షిణాఫ్రికా కేవలం 83 పరుగులకే ఆలౌట్ అవ్వడంపై ‘ఏ’ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  కాగా ఈ విజయంతో వరల్డ్ కప్‌ 2023 పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించి మొత్తం 16 పాయింట్లతో టాప్-1 స్థానంలో నిలిచింది.

More Telugu News