Rahul Gandhi: కేదార్‌నాథ్ భక్తులకు టీ సప్లై చేసిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ

  • మూడు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్ వచ్చిన రాహుల్‌గాంధీ
  • కేదార్‌‌నాథ్ ఆలయ హారతికి హాజరై పూజలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత
  • ‘ఆదివాసీ’లను ‘వనవాసీ’లుగా పిలుస్తోందంటూ బీజేపీపై ఫైర్
Rahul Gandhi serves tea to devotees at Kedarnath Temple

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పవిత్ర కేదార్‌నాథ్ ఆలయం వద్ద భక్తులకు టీ సప్లై చేశారు. మూడు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ఆదివారం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. హారతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయం క్యూలో ఉన్న భక్తులకు రాహుల్ స్వయంగా టీ సప్లై చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. 

 అంతకుముందు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. కులగణనపై ప్రధాని మోదీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులను బీజేపీ ‘ఆదివాసీ’ అని కాకుండా ‘వనవాసీ’ అని పిలుస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి బదులు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ఆదివాసీ’ అనేది విప్లవాత్మకమైన పదమని, ఆదివాసీ అంటే దేశానికి మొదటి యజమాని అని అర్థమని రాహుల్ వివరించారు. అందుకనే బీజేపీ ఈ పదాన్ని ఉపయోగించడం లేదని విమర్శించారు. వారు ఆ పదాన్ని ఉపయోగిస్తే కనుక అడవి, నీరు, భూమిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కాగా, చత్తీస్‌గఢ్‌, మిజోరంలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లో 25న, మధ్యప్రదేశ్‌లో 17న, తెలంగాణలో 30న పోలింగ్ జరగనుంది.

More Telugu News