Israel-Hamas War: కాల్పులు ఆపితే హమాస్ మరింత రెచ్చిపోతుంది.. అరబ్ దేశాలకు తేల్చిచెప్పిన అమెరికా

  • గాజాపై వైమానిక, భూతల దాడులతో చెలరేగుతున్న ఇజ్రాయెల్
  • సామాన్యులు చనిపోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన అరబ్ దేశాలు
  • అమెరికా విదేశాంగ మంత్రితో అమ్మాన్‌లో భేటీ
  • ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు విషయంలో జోక్యం చేసుకోలేమన్న అమెరికా
  • బందీలను విడిచిపెట్టే వరకు దాడులు కొనసాగుతాయన్న బెంజమిన్ నెతన్యాహు
Antony Blinken rebuffs arab push for truce

హమాస్‌పై ప్రతీకారంతో ఊగిపోతున్న ఇజ్రాయెల్ భూతల, వైమానిక దాడులతో చెలరేగిపోతోంది. గాజాలోకి ఇప్పటికే ప్రవేశించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) హమాస్ తీవ్రవాదుల కోసం వేటసాగిస్తుండగా, మరోవైపు వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో సామాన్యులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారన్న అరబ్ దేశాల ఆందోళనను ఇజ్రాయెల్ ఏమాత్రం పట్టించుకోకుండా దాడులతో విరుచుకుపడుతోంది.

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో నిన్న ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతర్, యూఏఈ  దౌత్యవేత్తలు, పాలస్తీనా అథారిటీ అధికారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ ఆందోళనను ఆయన ముందుంచారు.  స్పందించిన బ్లింకెన్.. హమాస్ దాడికి ప్రతిగానే ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నదని, కాల్పుల విరమణ అంటే అది వారి హక్కుకు భంగం కలిగించడమే అవుతుందని స్పష్టం చేశారు. 

అంతేకాదు, ఇజ్రాయెల్ కనుక కాల్పుల విరమణ పాటిస్తే అప్పుడు హమాస్‌‌దే పైచేయి అవుతుందని, అది మరింతగా చెలరేగిపోయే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కుపై తమ మద్దతు విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. అయితే, మానవతా సాయం దృష్ట్యా ఇజ్రాయెల్ సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేయాలన్న ప్రతిపాదనపై మాత్రం సానుకూలంగానే ఉన్నట్టు చెప్పారు. అప్పుడు గాజా పౌరులకు అవసరమైన సామగ్రిని చేరవేసేందుకు విదేశీయులు ఈజిప్టులోకి వచ్చేందుకు అవకాశం లభిస్తుందని వివరించారు. 

మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా కాల్పుల విరమణకు ససేమిరా అంటున్నారు. హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న పౌరులను విడిచిపెట్టే వరకు దాడులు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.

More Telugu News