Virat Kohli: విరాట్‌కు ఆ శతకం గురించి వర్రీ లేదు: రాహుల్ ద్రావిడ్

  • విరాట్ ప్రస్తుతం చాలా రిలాక్స్డ్‌గా ఉన్నాడన్న భారత్ హెడ్ కోచ్
  • తన పుట్టిన రోజు లేదా శతకం గురించి ఆలోచించట్లేదని వెల్లడి
  • టోర్నమెంట్ గెలవడంపైనే విరాట్ తన దృష్టి కేంద్రీకరించాడన్న ద్రావిడ్
Virat Kohli not worried about his 49th hundred or his birthday says India coach Rahul Dravid

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో తన బాధ్యత నిర్వహించడంపైనే స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ దృష్టి పెట్టాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. తన 49వ వన్డే శతకం లేదా 35వ పుట్టిన రోజు గురించి విరాట్ ఆలోచించట్లేదని పేర్కొన్నాడు. వాంఖడే స్టేడియంలో గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తన 49వ శతకాన్ని కొద్దిలో మిస్ అయిన విషయం తెలిసిందే. క్రికెట్ లెజెండ్ సచిన్ హాజరైన ఆ మ్యాచ్‌లో అతడి రికార్డును సమం చేసే అపూర్వ అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సెంచరీకి 12 పరుగులు ఉందనగా అతడు పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. 

‘‘విరాట్ ప్రస్తుతం చాలా రిలాక్స్డ్‌గా ఉన్నాడు. అతడి ఆట తీరు చూస్తేనే ఇది అర్థమైపోతుంది. మ్యాచ్‌లో తన పాత్ర నిర్వహించేందుకు ఉత్సుకతతో ఉన్నాడు. ఎప్పుడూ ఉన్నట్టుగానే ఉన్నాడు. నాకైతే తేడాలు ఏమీ కనిపించలేదు. విరాట్ ఎప్పుడూ ప్రొఫెషనలే. ఎప్పుడూ కష్టపడి పనిచేస్తాడు. ఎప్పుడూ రెడీగా ఉంటాడు. అతడు తన శతకాల గురించి ఆలోచించట్లేదు. తన పుట్టిన రోజు గురించి కూడా అతడు ఆలోచిస్తున్నాడని నేను అనుకోవట్లేదు. టోర్నమెంట్ గెలవాలన్న దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టారు’’ అని మీడియాతో రాహుల్ వ్యాఖ్యనించాడు. 

కాగా, విరాట్ తన పుట్టిన రోజున స్టేడియంలో తన అభిమానుల హర్షధ్వానాల నడుమ 50వ సెంచరీ చేస్తాడని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.

More Telugu News