Wasim Akram: భారత బౌలర్లపై అనుమానం వ్యక్తం చేసిన హసన్ రజాపై వసీం అక్రమ్ ఫైర్

  • వరల్డ్ కప్ లో విశేషంగా రాణిస్తున్న టీమిండియా పేసర్లు
  • షమీ, సిరాజ్, బుమ్రా ధాటికి ప్రత్యర్థి జట్లు కకావికలం
  • బంతిని మార్చేస్తున్నారంటూ తీవ్ర అనుమానం వ్యక్తం చేసిన పాక్ మాజీ ఆటగాడు
  • అందరి ముందు పాక్ పరువు తీశావన్న వసీం అక్రమ్
Wasim Akram fires on Hasan Raza

టీమిండియా బ్యాట్స్ మెన్ వీరవిహారం చేసిన చోట, ప్రత్యర్థి జట్లు బ్యాటింగ్ చేయలేక కుదేలవుతుండడం ఈ వరల్డ్ కప్ లో దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ కనిపిస్తోంది. భారత పేసర్లు షమీ, బుమ్రా, సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నారు. 

దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా తీవ్ర అనుమానాలు వ్యక్తం చేయడం తెలిసిందే. టీమిండియా బౌలింగ్ చేసే సమయానికి బంతిని మార్చేస్తున్నారంటూ రజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఉపయోగిస్తున్న బంతిపై అదనపు లక్క పూత వల్ల స్వింగ్ ఎక్కువగా లభిస్తోందని అన్నాడు. ఈ కారణంగానే వారు వికెట్ల వేట కొనసాగిస్తున్నారని దారుణమైన అభిప్రాయం వెలిబుచ్చాడు. 

అయితే, పాకిస్థాన్ స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ తమ దేశానికే చెందిన హసన్ రజాపై మండిపడ్డాడు. ఇలాంటి చెత్త వాగుడుతో నీ పరువు తీసుకోవడమే కాదు... అందరి ముందు పాకిస్థాన్ పరువు కూడా తీశావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

"బంతి సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవడానికి మైదానంలో అంపైర్లు ఉన్నారు, రిఫరీ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. బంతి ఎందుకు ఎక్కువ స్వింగ్ అవుతోంది? ఎందుకు తక్కువ స్వింగ్ అవుతోంది? అనేది తెలుసుకోవడానికి టెక్నాలజీ కూడా ఉంది. భారత పేసర్లు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లుగా ఉన్నారు. వారికి నైపుణ్యం ఉంది. అందుకే వారు ఇతరుల కంటే మెరుగ్గా రాణిస్తున్నారు" అంటూ హసన్ రజాకు మొట్టికాయలు వేశాడు.

More Telugu News