Daggubati Purandeswari: విజయసాయిరెడ్డిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసిన పురందేశ్వరి

  • బెయిల్ పై ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని పురందేశ్వరి ఫిర్యాదు
  • 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని పేర్కొన్న వైనం
  • తక్షణమే బెయిల్ రద్దు చేయాలని విన్నపం
Purandeswari complained to CJI on Vijayasai Reddy

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న విజయసాయి అరాచకాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఆయన గుండెపోటుతో చనిపోయారని ప్రజలందరినీ తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీ ఇన్చార్జీగా ఉన్నప్పుడు... కడప గూండాలను అక్కడ దించి, భారీగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పారు. ఎందరినో బెదిరిస్తూ అక్రమాలు, అరాచకాలు చేశారని తెలిపారు. విజయసాయిరెడ్డిపై ఉన్న అన్ని కేసుల వివరాలను తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇప్పటికే విజయసాయిపై 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని పురందేశ్వరి తెలిపారు. పదేళ్లుగా బెయిల్ పై బయట ఉంటూ... సీబీఐ, ఈడీ కేసుల్లోని షరతులను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా నిరోధిస్తున్నారని తెలిపారు. పదేపదే వాయిదాలు కోరుతూ విచారణ కొనసాగకుండా అడ్డుకుంటున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. విజయసాయి బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని సీజేఐని కోరారు. విజయసాయిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News