Taj Mahal: తాజ్‌మహల్‌పై హిందూ సేన పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

  • తాజ్‌మహల్‌ను షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన్ ఢిల్లీ హైకోర్టులో పిల్
  • రాజా మాన్ సింగ్ ప్యాలెస్‌కు మార్పులు చేసి తాజ్‌మహల్‌ను సిద్ధం చేశారని వెల్లడి
  • ఈ విషయంపై ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దృష్టి సారించాలన్న కోర్టు
Delhi High Court asks ASI to look into Hindu Senas claims about Taj Mahals origins

ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై దృష్టి సారించాలని ఏఎస్ఐని కోరింది. ఆగ్రాలోని తాజ్‌మహల్ నిర్మాణం 1631-48 మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజ్‌మహల్‌కు సంబంధించి చరిత్ర పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దాలంటూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతమున్న తాజ్‌మహల్ ఒకప్పుడు రాజామాన్ సింగ్ ప్యాలెస్ అని, దానికి షాజహాన్ తన అభిరుచికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశాడని పేర్కొంది. ఈ మేరకు చరిత్ర పుస్తకాల్లో తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 

ఈ పిటిషన్‌పై జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ తుషార్ గెడెలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హిందూ సేన ఇదే తరహా పిటిషన్‌తో గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైనాన్ని ప్రస్తావించింది. కానీ, ఈ విషయంలో ఏఎస్ఐ ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంపై దృష్టిసారించాలని తాజాగా ఏఎస్ఐని కోరింది. కాగా, తాజ్‌మహల్ వయసు ఎంతో కూడా నిర్ధారించేందుకు ఏఎస్ఐ పరీక్షలు నిర్వహించాలని హిందూ సేన తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. తాజ్‌మహల్ విషయంలో తాము లోతైన అధ్యయనం చేశామని, చరిత్ర పుస్తకాల్లో ఈ విషయమై ఉన్న తప్పులు సరిదిద్ది ప్రజలకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని అభిప్రాయపడింది. రాజా మాన్ సింగ్ ప్యాలెస్‌ను కూల్చి మొఘలులు తాజ్‌మహల్ కట్టారనడానికి ఆధారాలు లేవని కూడా పేర్కొంది.

More Telugu News