Revanth Reddy: తన భద్రతపై డీజీపీకి లేఖ రాసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

  • హైకోర్టు ఆదేశాల మేరకు తనకు 6 ప్లస్ 6 భద్రత కల్పించాలని లేఖ
  • లేదంటే కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద కేసు వేస్తానని వెల్లడి
  • ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పారని గుర్తు చేసిన రేవంత్
Revanth Reddy writes letter to DGP

హైకోర్టు ఆదేశాల మేరకు తనకు తక్షణమే 6 ప్లస్ 6 భద్రతను కల్పించాలని లేదంటే కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద కేసు వేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డీజీపీకి లేఖ రాశారు. తన భద్రతకు సంబంధించి శుక్రవారం డీజీపీ అంజనీ కుమార్‌కు లేఖ రాశారు. 

ఎన్నికలు ముగిసే వరకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పి కూడా ఆ మేరకు భద్రత ఇవ్వడం లేదని ఆ లేఖలో ఆరోపించారు. అదనపు సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నట్లు పోలీసులు హైకోర్టులో తప్పుడు వాదనలు చేశారన్నారు. పైగా గత జులైలో తనకు ఉన్న 2 ప్లస్ 2 భద్రతను కూడా వెనక్కి తీసుకున్నారన్నారు. తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6 ప్లస్ 6 భద్రత కల్పించాలని, లేదంటే కోర్టుకు వెళతానని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు నామినేషన్లు దాఖలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి నామినేష‌న్ల ప్ర‌క్రియ శుక్రవారం ప్రారంభ‌మైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల అభ్య‌ర్థులు నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేస్తున్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లావ్యాప్తంగా తొలి రోజు పలువురు అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ల‌ను రిట‌ర్నింగ్ అధికారుల‌కు స‌మ‌ర్పించారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న చందుపట్ల కీర్తిరెడ్డి, వరంగల్ ఈస్ట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు, భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గండ్ర సత్యనారాయణ రావు, వరంగల్ ఈస్ట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న రాజనాల శ్రీహరి నామినేషన్లు సమర్పించారు.

More Telugu News